SGSTV NEWS online
CrimeTelangana

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 45 సార్లు బాంబు బెదిరింపులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఎలా చిక్కాడో తెలుసా..?



హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలుమార్లు నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ పంపిన కేసులో చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శరత్‌ సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశవ్యాప్తంగా 700–800 వరకు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


హైదరాబాద్ / చెన్నై: హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 800 సార్లు విమానాశ్రయాలకు వరుసగా నకిలీ బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన 38 ఏళ్ల శరత్ సుబ్రమణ్యం అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని నకిలీ బాంబ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఒక్క శంషాబాద్ విమానాశ్రయానికే (RGIA) నిందితుడు ఏకంగా 45 నకిలీ బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు శంషాబాద్ ఏసీపీ వి. శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. 2025 – 2026 సంవత్సరాల్లో ఇతను దేశవ్యాప్తంగా దాదాపు 800 ఎయిర్‌పోర్టులకు ఇదేవిధంగా బెదిరింపులు పంపి, భద్రతా సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టాడు.


చెన్నైలో అరెస్ట్ – విచారణలో సంచలన నిజాలు..
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న RGIA పోలీసులు.. టెక్నికల్ ఆధారాలతో నిందితుడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించి, పీటీ (Prisoner Transit) వారెంట్‌పై అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని వీడియోలు చూసిన తర్వాత స్థానిక డీఎంకే (DMK) నేతలపై తీవ్ర వ్యక్తిగత కక్ష పెంచుకున్నట్లు శరత్ తెలిపాడు. ఆ నాయకులే ఈ బాంబ్ బెదిరింపుల వెనుక ఉన్నట్లు నమ్మించి, వారిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే దురుద్దేశంతోనే తాను ఈ ఫేక్ మెయిల్స్ పంపినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్ నగర పరిధిలోని ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా దాదాపు 50 నుంచి 60 నకిలీ బాంబు బెదిరింపు కేసులు శరత్ సుబ్రమణ్యంపై నమోదైనట్లు సమాచారం. ఈ నకిలీ బాంబు బెదిరింపుల వెనుక ఎలాంటి ఉగ్రవాద నేపథ్యం లేదని, వ్యక్తిగత కారణాలే ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శరత్ సుబ్రమణ్యం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్ని సంవత్సరాలు అమెరికాలో కూడా పనిచేశాడని.. భార్యతో విడాకులు తీసుకుని, కొంతకాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Also read

Related posts