SGSTV NEWS online
Spiritual

అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!



అట్లతద్ది తెలుగు రాష్ట్రాల్లో కన్నె పడుచులు, వివాహితులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ. గోరింటాకు, ఉయ్యాలాటలు, గోంగూర పచ్చడి, ముద్దపప్పు వంటి సంప్రదాయ వేడుకలతో ఉత్సాహంగా సాగే ఈ పండుగ ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.



Atla Taddi Vratham Vidhanam :అట్లతద్ది తెలుగు రాష్ట్రాల్లో కన్నె పడచులు, వివాహితులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే ఒక విశిష్టమైన సాంప్రదాయ పండుగ. సూర్యోదయానికి పూర్వమే మొదలయ్యే ఈ పండుగ చంద్ర దర్శనంతో ముగుస్తుంది. గోరింటాకు, ఉయ్యాలాటలు, గోంగూర పచ్చడి, ముద్ద పప్పు వంటి సాంప్రదాయ వేడుకలతో ఉత్సాహంగా సాగే అట్లతద్ది పండుగ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ పండుగ ఎప్పుడు రానుంది? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి? అనే అంశాల గురించి తెలుసుకుందాం.


అట్లతద్ది పండుగ ఎప్పుడు?

తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజును అట్లతద్దిగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 28, బుధవారం ఆశ్వయుజ బహుళ తదియ సందర్భంగా ఈ రోజునే అట్లతద్ది పర్వదినాన్ని జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. చంద్రోదయ ఉమా వ్రతంగా కూడా వ్యవహరించే ఈ అట్లతద్ది పర్వదినం గురించి మరిన్ని విశేషాలు చూద్దాం.


అట్లతద్ది విశిష్టత

తెలుగు సంప్రదాయంలో పెళ్లికాని యువతులు మంచి భర్త కోసం, వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు, ఆయురారోగ్యాలు, అఖండ సౌభాగ్యం కోసం భక్తితో ఆచరించే పండుగే అట్ల తద్ది. అనాదిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ అట్లతద్ది. ఈ పండుగనే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు.

ఉమాదేవి ఆచరించిన వ్రతం

సతీదేవి దేహత్యాగం తరువాత ఆమె తిరిగి పర్వతరాజు పుత్రికగా ఉమాదేవిగా జన్మిస్తుంది. ఉమాదేవి పరమేశ్వరుని భర్తగా పొందడం కోసం ఎంతో తపస్సు చేస్తుంది. ఎన్నో నోములు ఆచరిస్తుంది. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారదుడు ఆమె మనోభీష్టాన్ని తెలుసుకుని పరమశివుని భర్తగా పొందాలన్న ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని సూచించాడు. నారద మహర్షి ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది.

వ్రతం గొప్పదనం

అట్లతద్ది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు కోరుకున్న వారిని పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన ఈ పూజలో, చంద్రకళల్లో కొలువైవున్న అమ్మవారి శక్తి అనుగ్రహం చేత స్రీల సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఇంతటి విశిష్టమైన ఈ అట్లతద్ది పండుగ ఎలా జరుపుకోవాలో చూద్దాం.

గోరింటాకు పండుగ

అట్లతద్ది పండుగ ముందురోజు రాత్రి అమ్మాయిలు అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ చేతులకు, కాళ్లకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఈ వేడుకల్లో సాంప్రదాయ గోరింటాకుకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

అట్లతద్ది వ్రత విధానం

అట్లతద్ది పండుగ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి తలారా స్నానం చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. పూజా మందిరంలో గౌరీదేవిని ప్రతిష్టించి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. అనంతరం సూర్యోదయానికి ముందే గోంగూర పచ్చడి, పెరుగన్నం తినాలి. తమలపాకులతో తాంబూలం వేసుకోవాలి. సూర్యోదయం అయిన తర్వాత ఇక ఏమి తినకుండా సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి.

ఉయ్యాలాటలు

ఈ రోజంతా కన్నెపిల్లలు తోటల్లో చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగుతారు. రోజంతా ఇలా సరదాగా గడిపిన తర్వాత సాయంత్రం అసలు వ్రతం ఆరంభమవుతుంది.

చంద్రోదయ వ్రతం

ఇది చంద్రుడు ఉదయించిన తరువాత ఆచరించే వ్రతం. అందుకే ఈ అట్లతద్ది వ్రతానికి చంద్రోదయ వ్రతమని కూడా పేరుంది. ఈ వ్రతం ఆచరించే వారు చంద్రోదయం తరువాత తలారా స్నానం చేసి గౌరీదేవిని ధూపదీపాలతో పూజించి 11 అట్లు అంటే దోశెలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ముత్తైదువులకు 11 అట్లు వాయనంగా ఇవ్వాలి. అటు తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన అట్లు ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని విరమించవచ్చు.

11 సంఖ్యకు ప్రాధాన్యం

అట్లతద్ది వ్రతంలో 11 సంఖ్యకు ప్రాధాన్యం ఉంది. ఈ వ్రతంలో భాగంగా 11 సార్లు ఉయ్యాల ఊగడం, 11 సార్లు తాబూలం వేసుకోవడం, 11 అట్లు నైవేద్యంగా సమర్పించడం, ముత్తైదువులకు 11 అట్లు వాయనం ఇవ్వడం సంప్రదాయం. అట్లతద్ది రోజు అట్లతద్ది వ్రతానికి సంబంధించిన కథను కూడా చదువుకోవాలి.


అట్లతద్ది కథ

పూర్వం ఒక రాజ్యంలో రాజు కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె స్నేహంగా ఉండేవారు. ఒకసారి అట్లతద్ది పర్వదినం రోజు వారు వ్రతంలో భాగంగా ఉపవాసం ఉంటారు. సాయంత్రానికి రాజకుమారి నీరసంతో కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఆమె అన్న అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి ‘ఇదుగోనమ్మా చంద్రుడు! ఇక భోజనం చేసి పూజ చేసుకో!’ అని అంటాడు.

రాజకుమారి వ్రత భంగం

అన్న మాటలు గౌరవించి రాజకుమారి భోజనం చేసి ఉమాదేవిని పూజిస్తుంది. దానితో రాజకుమారి చంద్ర దర్శనం తరువాత ఉమాదేవిని పూజించిన తరువాతనే భోజనం చేయాలనే నియమాన్ని ఉల్లంఘించడం వలన ఆమెకు వ్రత భంగం కలుగుతుంది.

ముసలివానితో వివాహం

కొంతకాలానికి రాజకుమారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనిపోనివి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలి వాడితో ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా! ఇలా ఎందుకు జరిగిందని? ఆలోచిస్తూ, బాధపడుతూ పార్వతీ, పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది.

యవ్వనవంతుడిగా మారిన రాజకుమారి భర్త
అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెబుతారు, అదృష్టవశాత్తు అదే రోజు అశ్వయుజ బహుళ తదియ. దాంతో ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి, గౌరీమాతను భక్తిశ్రద్ధలతో వేడుకుంటే నీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పి వారు మాయమయ్యారు. అప్పుడు రాజకుమారి చంద్రోదయ ఉమావ్రతం చేసుకుని పూజాక్షితలు తెచ్చి భర్త పై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనవంతుడిగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు.

అట్లతద్ది వ్రతంలో అంతరార్ధం
అట్లతద్దిలో పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. గౌరీదేవి కుజగ్రహానికి అధిదేవత! ఈ పండుగ సందర్భంగా గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై వివాహం, సంతానం విషయంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయని శాస్త్ర వచనం. అందుకే ఈ అట్లతద్ది పండుగకు అంతటి విశిష్టత! ఈ అట్లతద్ది పండుగను మనం కూడా జరుపుకుందాం. గౌరీదేవి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం. ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః



Related posts