పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి కొత్త అద్భుతాలు సృష్టి్స్తే మరికొందరు మాత్రం.. అదే టెక్నాలజీని అక్రమ సంపాధన కోసం వాడుకుంటున్నారు. తాజాగా ఇలానే ప్రత్యేక ఆన్లైన్ సాఫ్ట్వేర్ల సాయంతో అక్రమంగా ఆధార్, పాన్ కార్డులో వివరాలు మార్చుతూ డబ్బు దండుకుంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.5,000 నగదు, 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ ఆధార్, పాన్ కార్డులను తయారుచేస్తున్న అక్రమ దందా గుట్టురట్టయింది. ఆధార్, పాన్ కార్డుల్లో అక్రమ మార్పులు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. జల్పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన చింతల మహదేవ్ అనే వ్యక్తి బుద్వేల్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ‘కవిత ఏ టు జెడ్ ఆన్లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఈ మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఏడో తరగతి వరకు చదువుకున్న మహదేవ్, షాప్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రత్యేక ఆన్లైన్ సాఫ్ట్వేర్ల సాయంతో ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను అక్రమంగా మారుస్తూ దందాను ప్రారంభించాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచే ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. కార్డుల్లో కేవలం పుట్టిన తేదీ మార్చడానికి రూ.300, పూర్తి వివరాలు మార్చడానికి రూ.700 నుండి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నకిలీ గుర్తింపు కార్డులను కొందరు ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు పొందేందుకు, మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో బహిర్గతమైంది. నిందితుడి వద్ద నుంచి రూ.5,000 నగదు, 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ఒక ల్యాప్టాప్, ప్రింటర్, లామినేషన్ మెషిన్, ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Sabarimala Temple: శబరిమలలో మరో స్కాం.. ఉద్యోగి అరెస్ట్.. దేవస్వం బోర్డుకు నష్టం ఎంతంటే?
- ఏలినాటి శనితో అష్ట కష్టాలు.. బయటపడటానికి ఈ పరిహారాలు చేయండి
- మృతదేహాన్ని పాడెకు ఎందుకు కడతారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు, ఆచారాల రహస్యం ఇదే!
- శనివారం ఈ 5 వస్తువులను దానం చేస్తే శని దేవుడి అనుగ్రహం.. సకల శుభాలు కలుగుతాయట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





