SGSTV NEWS online
CrimeNationalSpiritual

Sabarimala Temple: శబరిమలలో మరో స్కాం.. ఉద్యోగి అరెస్ట్.. దేవస్వం బోర్డుకు నష్టం ఎంతంటే?



Sabarimala Ghee Scam: శబరిమల మిల్మా నెయ్యి సరఫరా కుంభకోణం కేసులో మరో ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నెయ్యిని ఇతర సంస్థలకు అక్రమంగా విక్రయించి, నాణ్యత తక్కువగా ఉన్న నెయ్యిని సన్నిధానానికి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో దేవస్వం బోర్డుకు సుమారు రూ.2.27 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.


Sabarimala Milma Ghee Scam: ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మిల్మా నెయ్యి అక్రమాల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నెయ్యి స్టోర్ సూపరింటెండెంట్ కార్యాలయ ఉద్యోగి జయలాల్‌ను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మిల్మా నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, డబ్బులు పొందిన వ్యవహారంలో జయలాల్‌కు పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ ఎస్‌ఎస్ బిను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తాజాగా ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.


మిల్మా నెయ్యి పేరుతో భారీ అక్రమాలు!
గత ఏడాది మండల-మకరవిళక్కు సీజన్‌లో శబరిమల సన్నిధానానికి సరఫరా చేయాల్సిన మిల్మా నెయ్యిని అక్రమంగా ఇతర సంస్థలకు విక్రయించినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. తమిళనాడులోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, లియో ట్రేడర్స్ సంస్థలకు నెయ్యిని మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మిల్మా నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నప్పటికీ, వాస్తవంగా తక్కువ నాణ్యత కలిగిన నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.



కాంట్రాక్టర్ అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన వివరాలు

ఈ కేసులో ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ ఎస్‌ఎస్ బినును ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెయ్యి సరఫరా వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బినును మరింత లోతుగా విచారించడంతో పాటు, తమిళనాడులోని సంబంధిత సంస్థల వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నెయ్యి సరఫరా వ్యవహారంలో తప్పుడు పత్రాలు ఎలా సృష్టించారు? నెయ్యిని ఇతర సంస్థలకు ఎలా తరలించారు? ఈ అక్రమాల్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.



దేవస్వం బోర్డుకు రూ.2.27 కోట్ల నష్టం?
ఈ నెయ్యి కుంభకోణం కారణంగా కేరళ దేవస్వం బోర్డుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. మిల్మా నుంచి సుమారు 1.65 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక లీటరు నెయ్యికి రూ.369 చొప్పున ధరను కోట్ చేయగా, మిల్మా నుంచి కొనుగోలు చేసేందుకు లీటరుకు రూ.510 వరకు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం సుమారు రూ.2.27 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం అక్రమాల విలువ, నష్టానికి సంబంధించిన లెక్కలపై దర్యాప్తు అధికారులు మరింత స్పష్టత తీసుకురావాల్సి ఉంది.

దేవస్వం బోర్డు అధికారుల పాత్రపైనా అనుమానాలు
ఈ వ్యవహారంలో దేవస్వం బోర్డుకు చెందిన మరికొందరు అధికారుల పాత్ర ఉందా? అనే కోణంలోనూ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టయిన నిందితుల నుంచి లభించే సమాచారంతో ఈ అక్రమాల వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శబరిమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి సరఫరా చేసే నెయ్యి విషయంలోనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయా? దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయి? అనేది వేచి చూడాలి.

Related posts