విశాఖపట్నంలో దారుణం. తాళం వేసిన ఇంట్లో దుర్వాసన రావడంతో పోలీసులు తలుపులు తెరిచి చూడగా, లాలం శ్రీదేవి అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతిచెంది ఉంది. పోస్ట్‌మార్టం నివేదికలో హత్యగా తేలింది. బంగారం కోసమే పక్కింటి ఫల్గుణరావే ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఒంటరిగా ఉన్న మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇంటికి తాళం వేసి ఉంది.. అదే ఇంటి నుంచి దుర్వాసన వస్తుంది..! పోలీసులకు సమాచారం ఇస్తే.. ఇంట్లో ఓ డెడ్ బాడీ.. వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. మరి.. ఇంట్లో వృద్ధురాలు ఉంటే బయట నుంచి తాళాలు ఎవరు వేశారు..? కూపీ లాగితే.. పోలీసులకు క్లూ దొరికింది. పక్కింటి వాడే ఆమె ప్రాణం తీసేశాడు. ఆ హత్యకు కారణం ఏంటి..? పోలీసులు కేసు ఎలా ఛేదించారు..?
విశాఖ కంచరపాలెం పట్టాభిరెడ్డి గార్డెన్స్ ప్రాంతం. పోలీసులకు అక్టోబర్ 17వ తేదీన ఓ ఫోన్ కాల్. ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్టు అనుమానాస్పదంగా ఉందంటూ ఆ కాల్ సారాంశం. రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపులు తీశారు. లోపలికి వెళ్లి చూస్తే.. లాలం శ్రీదేవి అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయి ఉంది. కానీ బయట నుంచి ఇంటికి తాళం వేసి ఉంది. మృతదేహం వద్ద పెనుగులాట జరిగిన ఆధారాలు పోలీసులకు కనిపించాయి. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు.
పోలీసుల ఆ.. అనుమానమే నిజమైంది..!
లాలం శ్రీదేవిని అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంటరిగా మహిళ ఉంటున్నట్టు తెలుసుకున్న వాళ్లే.. పరిచయస్తులే ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. మెడలో బంగారం గొలుసు మాయమైనట్టు గుర్తించారు. ఇంతలో పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అందులో ఆ వృద్ధురాలిని ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసినట్టు గుర్తించారు పోలీసులు. అప్పటికే సేకరించిన ఆధారాలతో.. పోలీసులు నిందితుడిని కన్ఫర్మ్ చేసుకున్నారు.
పక్కింటి వాడే ఆ పని చేశాడు..!
నిందితుడు ఫల్గుణరావు.. శ్రీదేవి నివాసముంటున్న ప్రాంతంలోనే ఉంటాడు. పక్కింట్లోనే నివాసం ఉంటున్నాడు. శ్రీదేవి పిల్లలు.. ఒకరు విదేశాల్లో.. మరొకడు హైదరాబాదులో ఉంటున్నారు. రెండు నెలల క్రితమే పట్టాభిరెడ్డి గార్డెన్స్ ప్రాంతంలోకి ఆ వృద్ధురాలు అద్దెకు దిగింది. ఆమెకు పక్కింట్లోనే ఉంటున్నాడు ఫల్గుణరావు. ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గుర్తించిన వాడికి.. దుర్బుద్ధి పుట్టింది. తనకున్న ఆర్థిక సమస్యలు ఎలా తీర్చాలి అన్న దానిపై ప్లాన్ చేసుకున్నాడు. వృద్ధురాల నుంచి టార్గెట్ చేశాడని క్రైమ్ ఏడీసీపీ రమ్య అన్నారు.
అలా ప్లాన్ చేసి.. వాటర్ బాటిల్ తో..
ఫల్గుణరావు ఫ్యామిలీ ఊరెళ్ళింది. దీంతో ఇదే అదనుగా భావించాడు.. ఈనెల 14వ తేదీ రాత్రి 7 గంటలకు సమయంలో.. శ్రీదేవి ఇంటికి వెళ్ళాడు ఫల్గుణ రావు. కాళీ బాటిల్ తీసుకెళ్లి నీళ్లు కావాలని అడిగాడు. వీడి మాటలు వెనుక మర్మాన్ని గ్రహించలేని ఆ వృద్ధురాలు.. బాటిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. ఆమె వెనకాలే లోపలికి చొరబడ్డాడు నిందితుడు. తిరిగి చూసేసరికి వెనుక నిలిచి ఉన్నాడు. అరిచేందుకు ప్రయత్నిస్తే వృద్ధురాలు నోరు నొక్కేశాడు. కిందకు తోసి.. ఊపిరి తీసేశాడు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్ ను లాక్కొని.. ఇంటి బయటకు వచ్చి తాళం వేసి పారిపోయాడని క్రైమ్ ఏడీసీపీ రమ్య వెల్లడించారు.
చైన్ అమ్మేసి.. ఏమీ ఎరగనట్టు నటించి..
తస్కరించిన ఆ చైన్‌ను ముత్తూట్ ఫైనాన్లో అమ్మకానికి పెట్టేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్టు మిన్నకుండిపోయాడు ఫల్గుణరావు. పోలీసులు రంగంలోకి దిగితే అసలు విషయం తెలిసింది. నిందితుడు పక్కింటివాడే అని తేలింది. పక్కా ఆధారాలతో ఫల్గుణ రావును అరెస్టు చేసిన పోలీసులు.. బంగారం అమ్మేసి, దగ్గర ఉంచుకున్న 21 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్లోని 60వేలు నగదును ఫ్రీజ్ చేయించామని క్రైమ్ ఏడీసీపీ రమ్య తెలిపారు. ఫల్గుణరావుకు చెందన బైక్‌ను సీజ్ చేశారు. నిందితుడు ఫల్గుణరావుని కటకటాల వెనక్కు నెట్టారు. వాటర్ కోసమని వచ్చి ఒంటరి మహిళను టార్గెట్ చేసి ఆమె ఊపిరి తీసిన కేసు లో పక్కింటి వాడే నిందితుడు కావడంతో ఇప్పుడు స్థానికులు హడాలెత్తిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
Also read
- Warangal: ఇదెక్కడి విడ్డూరం.. భార్య మాట్లాడటంలేదని ఏకంగా రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన భర్త.. వీడియో..
- హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.
- కూలి పనులకు తల్లిదండ్రులు.. ఇంట్లో ఆడుకుంటూ అనంతలోకాలకు ఏడాదిన్నర పాప..!
- Telangana: మూఢనమ్మకానికి బలైన మహిళ జీవితం.. దెయ్యం పేరుతో దారుణం..
- అయ్యో దేవుడా.. అమెరికాలో ఖమ్మం యువతి వాకింగ్ చేస్తుండగా ఊహించని ఘటన.. ఏం జరిగిందంటే..?





