ప్రేమ ముసుగులో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒకచోట దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటన అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించి పోలీసుల విధి నిర్వహణతో నిందితుడికి కఠినశిక్ష విధించింది కోర్టు.
ఒక చిన్న పొరపాటు జీవితాన్నే చీకటిమయం చేస్తుంది అనడానికి తెర్లాం మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక ఉదంతమే నిదర్శనం. అదే ప్రాంతానికి చెందిన ముడిదానా హరికృష్ణ అనే యువకుడు, ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వల వేశాడు. నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలికి, ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అక్కడితో ఆగకుండా, ఆమెను విజయవాడకు తరలించి మరికొన్ని రోజుల పాటు నరకం చూపించాడు. తీరా పని అయిపోయాక, ఏమీ ఎరగనట్టు ఆమెను ఇంటి వద్ద వదిలేసి పరారయ్యాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ బాలిక, ధైర్యంగా తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పోలీసుల విచారణలో హరికృష్ణ చేసిన ఘోరం బయటపడింది. పోలీసులు పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విజయనగరం పోక్సో (POCSO) ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసిన ప్రత్యేక కోర్టు, రూ. 3,000 నగదు జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
జిల్లా ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా యువతకు, ముఖ్యంగా బాలికలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రేమ – పెళ్లి అనే ముసుగులో వంచించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ఆకర్షణలకు లోనుకాకుండా, ఆపద కలిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ప్రేమ పేరుతో ఆడితే ‘లవ్ గేమ్’ అవ్వచ్చు కానీ, చట్టంతో ఆడితే అది ‘లైఫ్ గేమ్’ అవుతుంది. తప్పు చేసిన వాడు చట్టం నుండి తప్పించుకోలేడు!
Also read
- Hanuman Jayanti: హనుమాన్ జయంతి మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
- Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
- Hanuman Jayanti Special: ఆంజనేయుడికి తమలపాకుల ఇష్టం వెనుక కథ ఏమిటి?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఆమె రాత్రిపూట రేటు మాట్లాడుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్తుంది.. కాసేపటికి..





