తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరానికి చెందిన ముండ్రు పద్మ అనే మహిళ ఇంట్లో దొంగలు పడ్డారని, తనను బంధించి సుమారు 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై మొదట అయ్యో పాపం అనుకున్న స్థానికులు, ఆమెపై జాలి చూపించారు. అయితే, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా, ఈ ఘటన వెనుక ఉన్న నిజం తెలిసి అందరూ అవాక్కయ్యారు. పోలీసుల దర్యాప్తులో ఇది దొంగతనం కాదని, బీమా సొమ్మును పొందేందుకు పద్మ ఆడిన నాటకమని తేలింది. పద్మ పిల్లలు ఇద్దరు లండన్‌లో స్థిరపడగా, ఆమె కాపవరంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో దఫదఫాలుగా 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన పద్మ, వాటికి ఏడాది పాటు బీమా ఉంటుందని తెలుసుకున్నారు. ఈ బీమా సొమ్మును దక్కించుకోవడంతో పాటు, నగలను కూడా తన వద్దే ఉంచుకోవాలనే దురుద్దేశంతో ఆమె ఈ నాటకానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణలో భాగంగా పద్మ నివాసంలోని సిసిటివి కెమెరాలను పరిశీలించారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని, సిసిటివి కెమెరాల తీగలు తొలగించబడి ఉండటాన్ని గమనించారు.
అయితే, సిసిటివి ఫుటేజ్‌లు చూసినప్పుడు, పద్మ స్వయంగా ఇంట్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, వైర్లను కత్తిరించడం స్పష్టంగా కనిపించింది. దొంగలు ప్రవేశించిన విధానం గురించి పద్మ చెప్పిన కథనంలోనూ పొంతన లేని విషయాలు బయటపడ్డాయి. దొంగలు చేతులు, కాళ్లు కట్టేసి బంగారాన్ని దోచేశారని చెప్పిన పద్మ, సిసిటివి సాక్ష్యాలు చూపినప్పుడు, దొంగలు వచ్చారని నమ్మించేందుకే తాను అలా చేశానని, పిల్లలు బంగారం గురించి అడగకుండా ఉండేందుకే ఈ పని చేసినట్లు అంగీకరించింది. సాక్ష్యాలతో కూడిన సిసిటివి ఫుటేజ్‌లను చూపినప్పుడు, పద్మ తాను బీమా సొమ్ము కోసమే ఈ నాటకం ఆడినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి దొంగతనం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. పద్మపై గతంలోనూ కోరుకొండ పీఎస్‌లో 2/12 నంబర్ గల ఎస్సీ, ఎస్టీ కేసు నమోదై ఉందని పోలీసులు పేర్కొన్నారు. బీమా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలే ఆమెను ఇలాంటి నాటకం ఆడటానికి పురికొల్పి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అటువంటి తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన ముండ్రు పద్మపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





