జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగుపెట్టాల్సిన ఓ యువకుడిని మృత్యువు అర్ధాంతరంగా కబళించింది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంతలోనే జరిగిన ప్రమాదం అతని ఆశలపై నీళ్లు చల్లింది. ఇంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో నీట మునిగి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.
నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు.. అంతలోనే విగతజీవిగా మారాడు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన డ్రీమ్ కారులో ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం అతని ప్రాణాలను బలితీసుకుంది. విశాఖలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని మురళీనగర్‌కు చెందిన వరుణ్ (26) అనే యువకుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు వరుణ్ ఇటీవలే తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్ కారైన మహీంద్రా థార్‌ను కొనుగోలు చేశాడు. అలాగే షీలానగర్‌లో ఓ కొత్త ఫ్లాట్ కూడా తీసుకున్నాడు.
అయితే, ఏదో పని మీద బయటకు వెళ్లిన వరుణ్ తిరిగి ఇంటికి వస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అతను ప్రయాణిస్తున్న కారు మలుపు వద్ద అదుపుతప్పి నాతయ్యపాలెం ప్రాంతంలోని కిమ్స్ ఆసుపత్రి వెనుక ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారు నీటిలో మునిగిపోవడంతో వరుణ్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
ఉదయం చెరువులో కారును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. అందులో ఉన్న వరుణ్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన కేటుగాడు..
- Cyber Fraud: పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు!
- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
- Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్
- వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?





