ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార కూటమి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి తన వివరణ ఇస్తూనే, మరింత ఘాటుగా స్పందించారు.
అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు..
తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను చంద్రబాబును వ్యక్తిగతంగా తిట్టలేదు. నన్ను తిట్టారు కాబట్టే నేను తిరిగి స్పందించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. తాను ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేయనని భీష్మించుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై అసహనం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ప్రతికారం తీర్చుకుంటానని అంబటి హెచ్చరించారు. ‘ప్రస్తుతం నాపై దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇదంతా నేను గమనిస్తున్నాను. నా సమయం వచ్చినప్పుడు ఎవరినీ వదలను, కచ్చితంగా చంద్రబాబుపై ప్రతికారం తీర్చుకుంటా’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వం తరపున మంత్రి పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తండ్రిని వివాదంలోకి లాగడం అత్యంత దుర్మార్గమని వారు మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ, కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మరణించిన పెద్దలను ఉద్దేశించి మాట్లాడటం సంస్కారం కాదని వారు హితవు పలికారు.
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. అంబటి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదని, అంబటి రాంబాబు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అంబటి వివరణ తర్వాత కూడా వివాదం సద్దుమణగడం లేదు. ఒకవైపు టీడీపీ శ్రేణులు అంబటి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టగా, మరోవైపు వైసీపీ నేతలు అంబటిని సమర్థిస్తున్నారు. పోలీసుల తీరుపై అంబటి చేసిన ఆరోపణలు కూడా చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని, చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు వ్యక్తిగత దూషణల పర్వంతో హీటెక్కాయి.
Also read
- చేతులెట్లా వచ్చాయిరా..! సహజీవనం చేస్తూనే.. నిండు గర్భిణీని 14 సార్లు పొడిచిన వ్యక్తి!
- భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్తున్న సివిల్ ఇంజనీర్ లాస్ట్ మెసేజ్!
- ఆపరేషన్ థియేటర్లో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి..
- MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్.. ఇంకో వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు..
- Crime news: పెళ్లి పేరుతో రప్పిస్తాడు.. ఆభరణాలతో ఉడాయిస్తాడు





