SGSTV NEWS online
Astrology

వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?




ఆగస్టు 16 నుంచి 22, 2026 వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మీనం తదితర రాశులకు ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు అందే అవకాశం ఉండగా.. మరికొందరు ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.




వార ఫలాలు – (ఆగస్టు 16 నుంచి 22, 2026 వరకు ) : మేషం రాశి వారికి వారమంతా చాలా వరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృషభం రాశి వారికి పంచమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మిథునం రాశి వారికి వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వారమంతా చాలా వరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. గురు, రాహువుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా పురోగ మిస్తాయి. ఆరోగ్యం మీద కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది. జీవత భాగస్వామితో సానుకూలత ఏర్ప డుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.



వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

పంచమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ల వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు, రోగ, రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బుధ, శుక్ర, గురు గ్రహాల సంచారంతో పాటు, రాహు కేతువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్య వర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గురు బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసరమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో శుభ విందు కార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి వృత్తి, ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

లాభ స్థానంలో కుజుడు, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్క బెట్టడం జరుగుతుంది. అష్టమ స్థానంలో శని ఉన్నందువల్ల ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశిలో శుక్రుడు, లాభ స్థానంలో గురు, బుధుల సంచారం అనుకూలంగా ఉన్నందు వల్ల వ్యక్తి గత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు తేలికగా పూర్తవు తాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ వారమంతా గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. గురు, శనుల బలంతో పాటు శుక్ర, కుజులు కూడా అనుకూలంగా మారి నందు వల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాల్ని మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు అష్టమ స్థానంలో అనుకూలంగా లేనప్పటికీ గురు, శనులు సరైన స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్రుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసు కోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు తప్ప ఇతర శుభ గ్రహాల బలం చాలావరకు అనుకూలంగా ఉంది. శుభగ్రహమైన శుక్రుడు దశమ స్థానంలో, రాహువు తృతీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. దగ్గర బంధువులు ఆర్థిక విషయాల్లో కొద్దిగా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. సప్తమ స్థానంలో రవి, గురువులు, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అయితే, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు వృద్ధి చెందుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తల పెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వారమంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. సప్తమ స్థానంలో 17 నుంచి రవి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అనుకున్నవి అనుకున్నట్టు సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యో గంలో సానుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యంగా అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఏలిన్నాటి శనితో పాటు, సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడూ కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో బుధ, రవులతో కలిసి ఉండడం, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్ది పాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి.

Also read

Related posts