పనిపాట లేకుండా జులాయికి తిరుగుతున్నావ్.. ఇళ్లు గడిచేదెలా అని ప్రశ్నించిన పాపానికి ఓ ఇల్లాలు ప్రాణాలు కోల్పోయింది. భార్య మాటలకు తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. చేతి అందిన కర్రతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భార్య హాస్పిటల్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానిక సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లయిన నాటి నుంచి ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్న భర్తను మందలించడమే ఆ ఇల్లాలికి మరణశాపమైంది. నన్నే నిలదీస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, ఇంటి పని చేసుకుంటున్న భార్య తలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలోని మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోహీర్ మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన జైపాల్ అలియాస్ సురేష్, భాగ్యలకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
వివాహమైనప్పటి నుంచి జైపాల్ ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారమంతా భాగ్యపైనే పడింది. ఆమె స్థానికంగా ఉన్న ఓ సూపర్ బజార్లో పని చేస్తూ భర్తను, ఇద్దరు పిల్లలను పోషించు కుంటోంది.వీరితో పాటే ఉంటున్న భాగ్య తల్లి శుక్రవారం పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ మొదలైంది.
ఎన్నాళ్లు ఇలా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటావు అని భాగ్య తన భర్తను నిలదీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జైపాల్, ఇంటి బయట వంట పాత్రలు కడుగుతున్న భాగ్యపై కర్రతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దాడి అనంతరం నిందితుడు సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న భాగ్యను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. తల్లి రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించడం,తండ్రి కూడా భయంతో పారిపోవడంతో ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఆ ఇద్దరు చిన్నారులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులందరినీ కంటతడి పెట్టించింది. తల్లి మృతి చెందడం, హత్య కేసులో తండ్రి జైలుకు వెళ్లనుండటంతో పదేళ్ల లోపు ఉన్న ఆ ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు
Also read
- తెలంగాణ : ప్రశ్నించడమే ఆమె చేసిన పాపమా.. భర్త కోపానికి బలైన భార్య.. అసలేం జరిగిదంటే?
- సినిమాను మించిన ట్విస్ట్.. 15 కిలోల బంగారం దోచేసిన సోషల్ మీడియా స్టార్స్.. ఎలా చిక్కారంటే..?
- Suryapet: బ్రేక్ డౌన్ అయిన కారు పెద్ద గుట్టే విప్పింది.. అసలు ఏమైందంటే..?
- Hyderabad: ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు!
- కళ్లలో కారం చల్లి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ దారుణ హత్య.. 8 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!





