SGSTV NEWS
Andhra PradeshCrime

ముఖం చూసి అమాయకుడు అనుకునేరు..! శ్రీవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన పేరిట చేతివాటం!

కళాకారుల కోరికనే తెలంగాణకు చెందిన ఒక మోసగాడికి ఆదాయ వనరైంది. అక్రమంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. తిరుమలలో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తానంటూ కళాకారులను అడ్డంగా దోచేసేందుకు మార్గమైంది. లక్షల రూపాయలు దండుకుని ఏకంగా 2900 మంది కళాకారులకు కుచ్చుటోపి పెట్టాడు..

తిరుపతి, జులై 3: శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చోట నృత్య ప్రదర్శనంటే మామూలు విషయమా మరి.. అది కూడా తిరుమల ఆస్థాన మండపంలో నృత్యం చేసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఇంకేం భాగ్యం. కళాకారుల కోరికనే తెలంగాణకు చెందిన ఒక మోసగాడికి ఆదాయ వనరైంది. అక్రమంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. తిరుమలలో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తానంటూ కళాకారులను అడ్డంగా దోచేసేందుకు మార్గమైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్ ఈ మేరకు ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. అయితే అడ్డంగా దొరికి పోయాక అభిషేక్ అక్రమ వసూళ్ల వ్యవహారం బయటపడింది. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీనివాస కళార్చన పేరుతో రెండు రోజుల నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించి మోసానికి తెర తీశాడు అభిషేక్.

ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలను టార్గెట్ చేసిన అభిషేక్ 93 కళాబృందాల్లోని 2900 మంది కళాకారులను టార్గెట్ చేశాడు. వారి నుంచి ఏకంగా రూ.35 లక్షల దాకా వసూలు చేశాడు. కళాకారులకు వసతి భోజనం తోపాటు శ్రీవారి దర్శనం ప్రసాదం జ్ఞాపికతో సన్మానం కూడా చేయిస్తానని నమ్మించాడు. ఈ మేరకు ప్రదర్శనలకు టీటీడీ నుంచి అనుమతి పొందిన అభిషేక్ అసలు వ్యవహారం కొందరు కళాకారుల ఫిర్యాదుతో టీటీడీ హిందూ ధార్మిక ప్రచార పరిషత్‌కు తెలిసింది. దీంతో టీటీడీ ప్రదర్శనలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ముందు అనుమతించి ఆ తరువాత ప్రదర్శనలకు టీటీడీ నో చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ ఎట్టకేలకు తిరిగి అనుమతి పొందాడు.

ఇందులో భాగంగానే గత జూన్ 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు ప్రదర్శనలకు అనుమతి పొందిన అభిషేక్ పరిమితికి మించి కళాకారులను తిరుమలకు తీసుకొచ్చారు. అయితే టీటీడీ కళాకారులు అందరికీ ప్రదర్శనలు ఇవ్వకపోవడంతో కళాబృందాలు నిరసనకు దిగాయి. దీంతో అభిషేక్ అసలు మోసం వెలుగు చూసింది. టీటీడీ విజిలెన్స్, పోలీసులు చేసిన విచారణలో అభిషేక్ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఇందులో భాగంగానే తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 14 లక్షలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుపతి కోర్టులో అభిషేక్ ను హాజరు పరచడంతో కోర్టు 15 రోజుల రిమాండ్ ఆదేశించింది.

Also read

Related posts

Share this