SGSTV NEWS
Andhra Pradesh

Prakasam: శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

 

శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించగా.. ఆశ్చర్యకరంగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆ విగ్రహాలు జాగ్రత్తగా భద్రపరిచి.. పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఓ అరుదైన పురాతన శిల్ప సంపద వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శివాలయ అభివృద్ధి పనుల సమయంలో తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు స్థానికులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేశాయి. గురువారం శివాలయ పరిసరాల నుంచి మట్టిని తొలగించి ట్రాక్టర్ సహాయంతో గ్రామ బయటకు తీసుకెళ్లిన వేళ.. ఆ మట్టిలో అరుదైన శిల్పాలు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూగన్న ఆ మట్టిలో ఉన్న విగ్రహాలను గమనించి జాగ్రత్తగా పక్కకు తీశారు.

ఆయన సమాచారంతో అక్కడికి వచ్చిన పురావస్తు శాసన పరిశోధకులు శ్రీనివాసప్రసాద్‌ వాటిని పరిశీలించారు. అనంతరం ఈ విగ్రహాలు మొత్తం 11 ఉండగా.. అవన్నీ విష్ణువు భక్తులుగా ప్రసిద్ధిచెందిన ఆళ్వారులవిగా గుర్తించారు. ఆయా శిల్పాల్లోని శిల్పకళ, దుస్తుల శైలి, ముఖచిత్రాల ద్వారా అవి 15వ నుంచి 16వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవని పేర్కొన్నారు.

పురావస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ విగ్రహాలు ఒకప్పుడు ఎక్కడైనా ఓ పురాతన వైష్ణవ దేవాలయంలో ప్రతిష్టించబడ్డవై ఉండవచ్చని… కాలక్రమేణా పాడైపోయిన ఆ ఆలయ శిథిలాల్లోంచి వీటి మిగతా భాగాలు పునాది భూభాగాల్లో కలిసిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వీటిని భద్రంగా ఉంచి.. తదుపరి పరిశోధనలకు దోహదపడేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Also read

Related posts

Share this