వాళ్లు మామూలు దొంగలు కాదు.. వాళ్ల టార్గెటే డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్లే హర్యానా ఏటీఎం దొంగలు. ఏ ఏటీఎం పడితే ఆ ఏటీఎంలో దొంగతనాలు చేయరు. కేవలం ఆ ఒక్క బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలలోనే చోరీలకు పాల్పడతారు. వాళ్ల చోర కళ పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా చోరీలకు బైకులు, కార్లు ఉపయోగిస్తే, వీళ్ళు ఏకంగా హర్యానా నుంచి లారీ వేసుకొని వచ్చారు. హర్యానా దొంగలు అనంతపురంలో పడ్డారు. అసలు ఏంటి హర్యానా దొంగల స్పెషల్..? అనంతపురం పోలీసులు వారిని ఏ విధంగా పట్టుకున్నారు?
గత కొన్ని నెలలుగా అనంతపురంలో హర్యానా దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. ఏటీఎంలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతూ, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అది కూడా ఏ బ్యాంకు ఎటిఎం పడితే ఆ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేయడం లేదు. కేవలం ఎస్‌బీఐ బ్యాంక్ ఎటిఎంలనే టార్గెట్‌గా చేసుకుని పక్కా స్కెచ్‌తో చోరీలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలలో అనేక ఏటీఎంలో ఈ హర్యానా ముఠా చోరీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ హర్యానా గ్యాంగ్ చోరీ చేసే విధానం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. మొత్తం 12 మంది సభ్యులతో ముఠాగా ఏర్పడి, ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నారు. 12 మంది గ్యాంగ్‌లో రాబిన్, సలీం ఇద్దరు కీలక నిందితులు. 12 మంది ముఠా సభ్యుల్లో ఒకరైన లారీ డ్రైవర్ షాకీర్.. హర్యానా నుంచి బెంగళూరుకు, అనంతపురంకు ఏదైనా లోడుతో వస్తాడు. అనంతరం తిరిగి వేరే లోడుతో హర్యానాకు వెళ్తాడు. ఇలా వచ్చి వెళ్లే గ్యాప్‌లో లారీ డ్రైవర్ షాకీర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏటీఎం కేంద్రాలను పరిశీలించి, వాటి దగ్గర భద్రత, సీసీ కెమెరాలు, ప్రజల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈజీగా చోరీ చేసేందుకు అనువైన ఏటీఎం కేంద్రాల సమాచారాన్ని రాబిన్, సలీంలకు అందిస్తాడు.
ఆ తర్వాత గ్యాస్ కటింగ్ లలో ప్రావీన్యుడైన సద్దాంతో చర్చించి, మిగతా సభ్యులందరిని సమీకరించుకుంటారు. అనంతరం టార్గెట్ ఫిక్స్ చేస్తారు. ఇక హర్యానా నుంచి ఫేక్ నెంబర్లతో రెండు కార్లలో అనంతపురం చేరుకుంటారు. అనంతపురం వచ్చాక స్థానికంగా ఉన్న ఆటోలలో ప్రయాణించి, తాము టార్గెట్ చేసిన ఏటీఎంలో వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఇక ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వచ్చిన పని పూర్తి చేస్తారు. హర్యానా నుంచి గ్యాస్ కట్టర్, గడ్డపారలు తీసుకొచ్చి… ఏటీఎంలు పగలగొట్టి చోరీలకు పాల్పడతారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాలకు బ్లాక్ కలర్ స్ప్రే చేస్తారు. ఇలా చోరీ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఖర్చుల కోసం ముఠా సభ్యులకు ఇచ్చాక.. మిగిలిన సొమ్ము అంతా గ్యాంగ్‌లో కీలకమైన రాబిన్ తన వద్దే ఉంచుకుంటాడు. అందరూ హర్యానా చేరుకున్నాక వాటాలు పంచుకుంటారు.
ఇలా గత కొన్ని నెలలుగా ఈ హర్యానా గ్యాంగ్ వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతూ… పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు విచారణ చేపట్టిన పోలీసులకు అన్నీ దొంగతనాల్లో కామన్ గా జరిగిన ఒక పాయింట్ ను గుర్తించారు… కేవలం ఎస్బిఐ ఏటీఎంలోనే చోరీలు జరుగుతుండడంతో… ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు కచ్చితంగా మరోసారి ఎస్‌బీఐ ఏటీఎం లోనే చోరీకి వస్తారని పోలీసులు పక్కా స్కెచ్ తో రెడీ అయ్యారు. పోలీసులు అనుకున్నట్లే హర్యానా గ్యాంగ్ అనంతపురంలోని ఓ ఏటీఎం సెంటర్‌లో చోరీకి పాల్పడాలని ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.
అయితే 12 మంది ముఠా సభ్యుల్లో.. ఐదుగురు మాత్రమే పోలీసులకు పట్టుబడ్డారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్‌బీఐ బ్యాంకుకు ఖాతాదారులు ఎక్కువగా ఉంటారని, లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతుండడం వల్ల ఎస్‌బీఐ ఎటిఎంలను ఎంచుకుంటున్నారు దొంగలు. ఎస్‌బీఐ ఏటిఎం సెంటర్ల దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉండరని తెలుసుకుని, హర్యానా గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇటీవల అనంతపురం జిల్లాలో నాలుగు చోట్ల ఏటీఎం కేంద్రాల్లో చోరీ జరిగింది. ఒక్క అనంతపురం జిల్లాలోని దాదాపు 50లక్షల రూపాయలు ఏటీఎంలో నుంచి ఈ హర్యానా గ్యాంగ్ చోరీ చేసింది.
ఇదే తరహాలో చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎం సెంటర్లో దాదాపు 26 లక్షల రూపాయలు, కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో ఏటీఎం మెషిన్ ను గ్యాస్ కట్టర్ తో కటింగ్ చేసి దాదాపు 18 లక్షల రూపాయల నగదుతో ఇదే హర్యానా గ్యాంగ్ ఉడాయించాింది. కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ హర్యానా గ్యాంగ్‌లో ఐదుగురు ముఠా సభ్యులను ఎట్టకేలకు అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు… నిందితుల నుంచి గ్యాస్ కట్టర్లు, గడ్డపారలతోపాటు రెండు లక్షల రూపాయల నగదు, ఒక లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కీలక నిందితుడు రాబిన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!