భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణ పరిహారం ప్రకటించాలి ….గ్రీష్మ కుమార్, జిల్లా అధ్యక్షుడు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం.
ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు నిడదవోలు ఐ లవ్ యూ సెంటర్ లో ఆదర్శ ప్లాట్ ఫాం రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఈమని గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పూర్తిగా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక అరకొరగా సంక్షేమ పథకాలు ప్రకటించారనీ, అవి కూడా కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన కు తర్వాత విడుదల చేసిన జి.ఓ కు సంబంధం లేదనీ, సదరు జి.ఓ లో ప్రమాద మరణ, అంగవైకల్య పరిహారం, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు ఊసే లేకుండా జి. ఓ విడుదల చేసారనీ, తద్వారా దశాబ్దాల నుండి దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల కు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఎత్తి వేసి కార్మికులకు ద్రోహం చేసిన నేపథ్యంలో ఐ.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఈ నెల 1 నుండి 7 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఎన్నికల హామీ మేరకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లిడి రామిరెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి లో సెస్ ద్వారా వసూలు చేయబడి నిల్వ ఉన్న సొమ్ము ను దారి మళ్లించకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చెయ్యాలని, గతంలో దారి మళ్ళించి వాడుకున్న సొమ్మును తిరిగి సంక్షేమ మండలిబోర్డు కు జమ చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోనేటి మల్లేశ్వర రావు, లంకాడ గణపతి, చొక్కా కుల సత్తిబాబు, నాగరాజు, సుబ్బారావు, సిర్రా వీర రాఘవులు, బాపినీడు తదితరులు పాల్గొన్నారు.
