SGSTV NEWS online
CrimeTelangana

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి పై ఏసీబీ పంజా.. అక్రమాస్తులు చూస్తే మీ మైండ్ బ్లాకే?


ACB Raids: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసుకున్న మరో అవినీతి అధికారిణి గుట్టును ఏసీబీ అధికారులు రట్టు చేశారు. పక్కాగా సేకరించిన సమాచారంతో ఆమె నివాసంతోపాటు ఎనిమిది చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీలు జరిపి కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా గుండు వాణి పని చేస్తోంది. కాగా, సెప్టెంబర్ 30న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండటానికి సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ తో కలిసి కలిసి 75వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.

ఏకకాలంలో దాడులు..

కాగా, వాణి అక్రమార్జనలతో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు తెలియటంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వాణికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్న వివరాలను పక్కాగా సేకరించారు.

సోమవారం ఉదయం వేర్వేరు బృందాలుగా విడిపోయి హైదరాబాద్ లోని వాణి నివాసంతోపాటు మొత్తం ఎనిమిది చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీల్లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల రెండు ప్లాట్లు ఉన్నట్టుగా పత్రాలు దొరికాయి. దాంతోపాటు జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల ప్లాటు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ మూడు ప్లాట్ల విలువ 87.67లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇంట్లో 5.47లక్షల నగదు..

ఇక, హైదరాబాద్ అత్తాపూర్ లో 63లక్షల రూపాయల విలువ ఫ్లాట్ ఉన్నట్టుగా వెల్లడైంది. అత్తాపూర్ లోనే 2.45 కోట్ల రూపాయల విలువ చేసే జీ ప్లస్ టూ భవనం ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండలో 29.70లక్షల విలువ చేసే 1.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టుగా డాక్యుమెంట్లు దొరికాయి. ఇక, వాణి ఇంట్లో 5.47లక్షల నగదు దొరికింది. మహబూబ్ నగర్ లో తుల్జా భవానీ వైన్స్ లో ఆమె 50లక్షలు పెట్టుబడులుగా పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. షేర్లలో 1.30కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా తేలింది.

అధికారులు సీజ్..

బ్యాంక్ అకౌంట్లో 7.97లక్షల నగదు ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక, ఇంట్లో 17తులాల బంగారు ఆభరణాలు దొరికాయి. దాంతోపాటు 98లక్షల విలువ చేసే రెండు కార్లు, 2లక్షల విలువ చేసే రెండు బైక్ లను అధికారులు సీజ్ చేశారు. ఇంట్లో 5.10లక్షల విలువ చేసే గృహోపకరణాలు ఉన్నట్టుగా గుర్తించారు. వాణి నివాసంతోపాటు ఆమె బినామీలుగా ఉన్న బంధుమిత్రుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 6.76 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ మార్కెట్ రేట్లతో చూస్తే వీటి విలువ దాదాపు వంద కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాణిపై అక్రమాస్తుల కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also read

Related posts