హైదరాబాద్: స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర పూర్వ ఇన్స్పెక్టర్ అరకపల్లి ఆంజనేయులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. ఇళ్లు, స్థలాలు, బంగారం కలిపి మొత్తం విలువ రూ.2.28 కోట్లని… మార్కెట్ ప్రకారం రూ.20 కోట్లకు పైగా ఉండొచ్చని సమాచారం. ఎల్బీనగర్ సమీప ప్రాంతాల్లోనే 540 చ.గజాల స్థలాలున్నాయి. ఇవన్నీ అక్రమాదాయంతోనే కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. ఆంజనేయులు, అతని బంధువులు, బినామీలు నివాసాలున్న నాలుగు ప్రాంతాల్లో అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సెప్టెంబరు 17న ఆంజనేయులును ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపించింది. సరిగ్గా నెల తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం గమనార్హం. ఈమేరకు ఏసీబీ శనివారం ప్రకటన విడుదల చేసింది.
భారీగా వ్యవసాయ భూములు
హైదరాబాద్ లోని లింగోజిగూడ, సరూర్ నగర్లలో రూ.30 లక్షల విలువైన 150 చ. గజాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లు, మన్సూరాబాద్‌లో రూ.40 లక్షల విలువైన 240 చదరపు గజాల విస్తీర్ణంలోని పాత ఇల్లు ఉంది. నల్గొండ జిల్లా పేరూరులో 180 చ.గజాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న రూ.50 లక్షల విలువైన ఇల్లు, మిర్యాలగూడ, హాలియాలలో రూ.80 లక్షల విలువైన రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. హాలియా, మిర్యాలగూడలో మరికొన్ని వ్యవసాయ భూములున్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. వాటి గురించి ఆరా తీస్తోంది. ఇవిగాక అంజనేయులు నివాసాల్లో తనిఖీలు నిర్వహించి.. రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారం, రూ.6.5 లక్షల విలువైన కారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు గుర్తించారు. కొన్ని ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నాడు. తనిఖీల్లో పట్టుబడ్డ మరికొన్ని ఆస్తుల గురించి అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ కేసు నేపథ్యం
ఆగస్టు 31న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర ఠాణా పరిధిలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 650 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అదికారులు స్వాదీనం చేసుకున్నారు. నిందితుడు సయ్యద్ ఇర్దాద్ను అదుపులోకి తీసుకుని కీసర పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ సమయంలో కీసర ఇన్ స్పెక్టర్‌గా ఉన్న ఆంజనేయులు నిందితుడిని అరెస్టు చేయకుండా నోటీసు ఇచ్చేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.5 లక్షలకు బేరం కుదిరింది.
ఆంజనేయులు ఆదేశాలతో ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆంజనేయులు ఆదేశాలతోనే లంచం తీసుకుంటున్నట్లు ఎస్సై చెప్పడంతో ఇద్దర్నీ అరెస్టు చేశారు.
Also read
- Astrology: డిసెంబర్ కల్లా వీరు జీవితంలో వెలుగు ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
- విజయదశమి నాడే ఆయుధ పూజ ఎందుకు చేయాలి? వాహనాలు, పనిముట్ల పూజ ప్రాశస్త్యం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నేర ప్రపంచంలో కొత్త ముఖాలు!
- ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ.. కర్రలు, ఇనుప రాడ్లతో ఓ కుటుంబంపై దాడి





