సోషల్ మీడియా వేదికగా చేసుకుని హనీట్రాప్ ద్వారా యువకులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న పవన్ కుమార్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఓ భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పవన్ కుమార్ అమ్మాయిల పేరుతో నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, యువకులతో పరిచయాలు పెంచుకొని, ఆ తర్వాత వారి నుంచి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వివరాల ప్రకారం, పవన్ కుమార్ సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులతో చాటింగ్ చేశాడు. బాధితులలో కేవలం మన భారత్‌కు చెందినవారే కాదు, ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బాధితుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వైద్యులు, వ్యాపారవేత్తలు, అధ్యాపకులు, ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, గిగ్ వర్కర్లు ఉన్నారు. 82 మంది బాధితులు నగ్న ఫోటోలు, వీడియోలను అతనికి షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసపూరిత కార్యకలాపాల ద్వారా బాధితులు సుమారు రూ.38 లక్షల వరకు నష్టపోయినట్లు అంచనా. పోలీసులు నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. బాధితులను మోసం చేసేందుకు కోల్‌కతాకు చెందిన ఒక మహిళ ఫోటోలను పవన్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 358/2026 కింద BNSలోని సెక్షన్లు 308(7), 351(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C, 66D, 66E, 67A కింద నిందితుడిపై కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. .
ఇతగాడి స్కెచ్చులు తెలిస్తే అవాక్కే..
పవన్ కుమార్ మోసాలకు ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. మొదట, అతను ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకునేవాడు. పరిచయం బలపడిన తర్వాత, ముఖ్యమైన వ్యక్తులను వాట్సాప్‌కు మార్చేవాడు. అయితే, అతను ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో మాట్లాడలేదు. తన గుర్తింపును దాచిపెట్టడానికి, అతను వీడియో కాల్స్‌లో కూడా ప్రత్యేకమైన పద్ధతులను పాటించాడు. వీడియో కాల్ చేసేటప్పుడు, తాను కుటుంబ సభ్యులతో ఉన్నానని లేదా ఇతర కారణాలతో తన వీడియోను ఆన్ చేయలేనని, మాట్లాడలేనని సాకులు చెప్పేవాడు. అదే సమయంలో, బాధితులు తమ వీడియోను ఆన్ చేయమని కోరేవాడు. బాధితులు తమ వీడియోలను ఆన్ చేసినప్పుడు, పవన్ కుమార్ వేరే మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఆ వీడియోలను రహస్యంగా రికార్డు చేసేవాడు.
ఒకవేళ బాధితులు ఒక్కసారి పంపిన ఫోటోలు లేదా వీడియోలు ఉన్నా, వాటిని ఒక ఫోన్లో ఓపెన్ చేసి, మరొక ఫోన్ ద్వారా రికార్డు చేసేవాడు. ఈ విధంగా సేకరించిన నగ్న ఫోటోలు, వీడియోలను ఉపయోగించి బాధితులను డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెట్టాడు. మొదట, అతని ఉద్దేశ్యం భిన్నంగా ఉన్నప్పటికీ, క్రమంగా డబ్బులు వసూలు చేయవచ్చని గ్రహించి, ఆర్థిక దోపిడీకి పాల్పడ్డాడు. కొన్ని సందర్భాల్లో, అతను బాధితులను భౌతికంగా కూడా కలిసినట్లు సమాచారం.
ఈ కేసు విచారణలో భాగంగా, పవన్ కుమార్ బాధితుల కుటుంబ సభ్యులను కూడా సంప్రదించాడా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు పంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Also read
- Astrology: డిసెంబర్ కల్లా వీరు జీవితంలో వెలుగు ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
- విజయదశమి నాడే ఆయుధ పూజ ఎందుకు చేయాలి? వాహనాలు, పనిముట్ల పూజ ప్రాశస్త్యం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నేర ప్రపంచంలో కొత్త ముఖాలు!
- ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ.. కర్రలు, ఇనుప రాడ్లతో ఓ కుటుంబంపై దాడి





