SGSTV NEWS online
Andhra PradeshCrime

లవర్‌కు మరొకరితో వివాహం జరిగిందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య


తిరుపతి: ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం జరిగిందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. చనిపోవడానికి ముందు.. ఈ పని చేస్తున్నందుకు క్షమించండి బాబాయ్.. అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఆమెను బాగా చూసుకోండి అని ఫోన్‌కు మెస్సేజ్ చేసి సూసైడ్ చేసుకున్నాడు.

చిత్తూరు జిల్లా గంగవరం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర (20), తిరుపతిలోని ఒక ప్రైవేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని వెంకటరమణ లేఅవుట్‌లో స్నేహితులతో కలిసి గది అద్దెకు ఉంటూ చదువుకుంటున్నాడు. మహేంద్ర కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తుండగా, ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అతడిని మందలించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం.. విద్యార్థి సూసైడ్
వారం రోజుల కిందట తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం జరగడంతో మహేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:45 గంటల సమయంలో తన బాబాయి, చెల్లెలి ఫోన్లకు చివరి మెస్సేజ్ చేశాడు. ‘బాబాయ్ ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి.. అమ్మ అంటే నాకు ఇష్టం, ఆమెను బాగా చూసుకోండి’ అని మెసేజ్ పంపాడు. తన రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు

శనివారం ఉదయం రూముకు వచ్చిన ఫ్రెండ్స్ మహేంద్ర మృతదేహాన్ని చూసి షాకయ్యారు. అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి పడమర పీఎస్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి జయచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ ఒక్కటే జీవితం కాదు.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దు
తిరుపతి పడమర పీఎస్ సీఐ రామకృష్ణ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమ విఫలమైందనో లేదా చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయనో క్షణికావేశంలో ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోవడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత కొన్ని విషయాలు గుర్తించాలని అధికారులు సూచించారు.

తల్లిదండ్రుల శ్రమను గుర్తించండి: మిమ్మల్ని ప్రయోజకులను చేయడానికి తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని, మీ ప్రాణం కంటే వారికి ఏదీ ముఖ్యం కాదని యువత గుర్తుంచుకోవాలని అధికారులు సూచించారు. మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం వారి జీవితాంతం కోలుకోలేని దెబ్బ తీస్తుందన్నారు.

కెరీర్‌పై దృష్టి పెట్టండి: ఇరవై నుంచి ముఫ్పై ఏళ్ల వయసు అనేది భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన సమయమని, ఈ దశలో భావోద్వేగాలకు లొంగిపోకుండా చదువు, కెరీర్‌పై దృష్టి సారించాలని సూచించారు. జీవితంలో ఒకరు దూరమైనంత మాత్రాన ప్రపంచం అంతం కాదని, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని యువకులకు సూచించారు.

అవగాహన అవసరం: ప్రేమ, ఆకర్షణల కంటే జీవితం చాలా పెద్దదని, కష్టకాలంలో ఉన్నప్పుడు స్నేహితులతోనో లేదా ఇంట్లో వారితోనో తమ బాధలు చెప్పుకుంటే మనసు కుదుట పడుతుందన్నారు. ఒత్తిడికి లోనైనప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలే తప్ప ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం మాత్రం కాదన్నారు.

Also read

Related posts