కొత్త తరహా నేరాలతో సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తునారు. ఇష్టానుసారంగా ఫోన్ నెంబర్లు సేకరించి కొత్త కొత్త స్కామ్‌ల పేరుతో బాధితులను బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుండి 30 లక్షల రూపాయలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు.
ఇటీవల దేశవ్యాప్తంగా పార్సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కాంకు తెరలేపారు. పార్సల్ పేరుతో వివిధ రకాల బాధితులకు ఫోన్లు చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తూ, నకిలీ పోలీస్ అధికారులుగా అవతారం ఎత్తుతూ దేశవ్యాప్తంగా వందలాది బాధితుల దగ్గర నుండి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీటి బారిన పడకుండా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఐఐటి పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థికి ఒక అగంతకుడు నుండి కాల్ వచ్చింది. తమ కొరియర్ సర్వీస్ నుండి మాట్లాడుతున్నామని విద్యార్థికి తెలిపారు. ఆ పార్సిల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మభ్య పెట్టారు. ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుపాలని విద్యార్థి కొరియర్ వారిని ఎదురు ప్రశ్న వేశాడు. అనుమానాస్పదంగా ఉన్న పార్సెల్‌లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్‌పోర్ట్ ఉన్నట్లు బాధితుడిని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. తనతో పాటు తన కుటుంబీకుల మొబైల్స్ లాప్టాప్‌లను టెర్రరిస్ట్ గ్రూపులు హ్యాక్ చేశారని నమ్మించారు.
కొరియర్ సంస్థ నిర్వాహకులు వెంటనే ముంబై పోలీసులకు కాల్ కలుపుతున్నట్లు నటించారు. ఆ వెంటనే లైన్‌లోకి వచ్చిన మరో సైబర్ నేరగాడు బాధితుడిని మరింత బెదిరించే ప్రయత్నం చేశాడు. తన బ్యాంక్ అకౌంట్‌కు టెర్రరిస్టులతో లింక్ ఉన్నట్లు నమ్మించారు. అందుకే తన మీద కేసు నమోదు చేస్తున్నామంటూ ఒక నకిలీ ఎఫ్ఐఆర్‌ను సైతం తయారు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించారు. ఇదంతా నిజమేమో అని అనుకోని నమ్మిన బాధితుడు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా 30 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాకి బదిలీ చేశాడు.
ఈ ఉదాంతంపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఎలాంటి కొరియర్ పెట్టలేదని అయినా సరే పలు విధాలుగా తనను నమ్మించే ప్రయత్నం చేశారని, తీవ్ర ఒత్తిడికి గురైన తాను 30 లక్షల రూపాయలు చెల్లించానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా 50 కోట్ల రూపాయల నగదును సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు.1930 కి వస్తున్న ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వెంటనే సైబర్ నేరగాల ఖాతాకి నగదు బదిలీ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ కు గురవుతున్న బాధితులు 24 గంటల్లోపు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే బాధితులకు ఖాతా నుండి నేరగాళ్ల అకౌంట్లోకి నగదు జమ కాకుండా ఫ్రీజ్ చేయగలుగుతామని పోలీసులు తెలుపుతున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం