SGSTV NEWS online
Andhra PradeshCrime

స్నేహం మాటున చిచ్చు  యువకుడి హత్యపై దర్యాప్తు ముమ్మరం


దువ్వ(తణుకు): ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొడుకే సర్వస్వం అనుకున్న తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. దువ్వలో సోమవారం రాత్రి నూతంగి రాకేశ్ (22) హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన దర్యాప్తును పోలీసులు మంగళవారం ముమ్మరం చేశారు. పోలీసు జాగిలాలను రంగంలోకి దించారు. క్లూస్ టీం సంఘటనా స్థలంలో వివరాలు సేకరించింది తాడేపల్లిగూడెం డీఎస్పీ నరసింహారావు ఆసుపత్రి వద్ద మృతదేహాన్ని పరిశీలించారు.

అసలేం జరిగిందంటే… స్నేహితులైన రాకేశ్, సంతోష్

మధ్య యువతి కారణంగా మనస్పర్థలు తలెత్తాయి. కొద్ది నెలల కిందట రౌడీలతో రాకేశ్ను కొట్టించినట్లు అతడి తల్లి చెబుతోంది. అనంతరం యువతితో కలిసి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు గ్రామీణ పోలీసులు రాకేశ్పై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. తనపై తప్పుడు కేసు పెట్టించారని గతంలో రాకేశ్ ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన రాకేశ్తో సంతోష్ మళ్లీ స్నేహంగా తిరుగుతూ సోమవారం రాత్రి ఇద్దరు కలిసి దువ్వ శివారులో మద్యం తాగారు. కొద్ది రోజుల నుంచి రాకేశ్ తల్లిపై సంతోష్ దుష్ప్రచారం చేస్తుండటంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి హత్యకు దారితీసింది. సోమవారం రాత్రి రాకేశ్ ఇంటికి సంతోష్ రావడం, వెళ్లడం సీసీ కెమెరాల్లో నమోదు కాలేదు. రాకేశ్ తల్లి, బంధువులు మాత్రం ఈ హత్యలో మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆధారం కోల్పోయిన తల్లి.. నూతంగి సుగుణ, వెంకటేశ్కు ఇద్దరు కుమారులు కాగా రాకేశ్ పెద్దవాడు. తండ్రి 20 ఏళ్ల కిందట, సోదరుడు పదేళ్ల కిందట మృతి చెందారు. పెయింటింగ్ పని చేస్తూ పోషిస్తున్న కొడుకుపైనే ఆధారపడి తల్లి జీవిస్తోంది. నెల రోజుల కిందట హైదరాబాద్లోని వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు రాకేశ్ తల్లి సుగుణ వెళ్లింది. ఈ క్రమంలో కొడుకు దారుణ హత్యకు గురికావడం ఆమె జీర్ణించుకోలేక గుండెలు అవిసేలా రోదించిన తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమెతో పాటు బంధువులు కోరుతున్నారు.

Also read

Related posts