ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలకు అస్వస్థత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
సత్తుపల్లి, : గన్నేరాకు కలిసిన పప్పు అన్నంతో తిని ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్వాడీ కేంద్రం-3లో చోటు చేసుకోగా, ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. అంగన్వాడీ కేంద్రంలో పని చేసే ఆయా నాగమణి అనారోగ్య కారణాలతో సెలవులో ఉండగా, టీచర్ కృష్ణకుమారి స్థానికురాలు దార్ల సరోజిని సహాయంతో భోజనం వండిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన సరోజిని న్యూట్రీషియన్ గార్డెన్లోని బచ్చలకూర, గోంగూరను కోస్తూ గన్నేరు చెట్ల ఆకులను పొరపాటున కోసి పప్పులో వేసి వంట చేశారు. పట్ర స్వప్న తన కుమారుడు యశ్వంత్, మరిది కుమారుడు రియాన్స్లకు తినిపించి ఆమె కూడా తిన్నారు తోట కుమారి కూడా తన మనుమరాలు తన్మయికి తినిపించి ఆమె కూడా భోజనం చేశారు. ఒక ఆకు ఉడకకపోవడంతో స్వప్న గన్నేరు చెట్టుది గుర్తించారు. కొద్దిసేపటికి పిల్లలు, ఆ మహిళలు నీరసించిపోగా సత్తుపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెక్టార్ సూపర్వైజర్ రజిని విషయాన్ని సీడీపీఓ సత్యవతి దృష్టికి తీసుకెళ్లారు. వీరి పర్యవేక్షణలో వైద్య సేవలను అందించారు. ఐసీడీఎస్ డీడబ్ల్యూవో ప్రమీల ఈసీజీ, రక్త పరీక్షలు చేయించగా ఏమీ తేలలేదు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం బాగానే ఉంది. విచారించి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి తెలిపారు.
“ఆయా లేకపోవడంతో టీచర్ రోజుకు రూ.100 ఇస్తానంటే వంట చేసేందుకు వెళ్లాను. ఆకుకూర మొక్కల మధ్యలో ఉన్న గన్నేరు ఆకులు పొరపాటున కోసి వంట చేశాను. కావాలని చేయలేదని” సరోజిని వాపోయారు.
Also read
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..
- బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు వేసి
- ‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య
- ప్రియురాలి బర్త్‌డే.. ఐఫోన్ సర్ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..





