చోరీ చేసిన సొత్తును తిరిగి అప్పగించడం, అందుకు క్షమాపణలు చెబుతూ లేఖ రాయడం చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి విచిత్ర ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు రెండు వారాల తర్వాత దాదాపు మొత్తం సొత్తును తిరిగి అదే ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. అంతేకాదు, తాము చేసిన పని తప్పేనని ఒప్పుకుంటూ ‘సారీ’ అంటూ లేఖ కూడా వదిలివెళ్లారు.
కాకినాడ జిల్లా కరప మండలం శివారు రామకంచిరాజునగర్కు చెందిన నామాల గణేష్ కుటుంబంతో కలిసి జులై 18న స్వగ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు రూ.6.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన గణేష్ చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
చోరీ జరిగిన 15 రోజుల తర్వాత, ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన బంగారం, నగదులో ఎక్కువ భాగాన్ని గణేష్ ఇంటి ఆవరణలో పడేసి వెళ్లారు. వాటితో పాటు ఒక చేతిరాత లేఖ కూడా ఉంచారు. ఆ లేఖలో, “మేము చేసింది తప్పే… క్షమించండి. రూ.22 వేల వరకు ఖర్చు చేశాం. ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేం. మిగతా సొత్తు మొత్తం తిరిగి ఇస్తున్నాం. సారీ” అని రాసి ఉంది. దీంతో ఇంటి యజమాని గణేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. రూ.22 వేల నగదు తిరిగి రాకపోయినా, విలువైన బంగారు ఆభరణాలతో పాటు మిగిలిన నగదు దక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చోరీ చేసిన దొంగలే తమ తప్పును ఒప్పుకుని సొత్తును తిరిగి ఇచ్చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు గతంలో అక్కడక్కడా నమోదైనా, క్షమాపణ లేఖ రాసి చోరీ చేసిన వస్తువులను తిరిగి అప్పగించడం మాత్రం అరుదైన సంఘటనగా స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తూ, సొత్తును తిరిగి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





