SGSTV NEWS online
CrimeTelangana

అర్ధరాత్రి వృద్ధులపై దాడిచేసి దోపిడీ

54 తులాల బంగారం, రూ.25 లక్షల నగదుతో దుండగుల పరారీ కరీంనగర్లో ఘటన.. పెద్దల్లుడిపైనే బాధితుడి అనుమానం.

కరీంనగర్- కొత్తపల్లి : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. వృద్ధ దంపతులు, వారి కుమార్తెలపై దాడిచేసి రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు దోపిడీ చేసిన ఘటన కరీంనగర్ భగత్నగర్లో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. భగత్నగర్కు చెందిన ఎండీ అజ్మత్ అలీ(80), మహముదా బేగం (65) దంపతులకు ముగ్గురు కుమారులు.. నలుగురు కుమార్తెలు. ఇటీవల ఆస్తి గొడవలు జరుగుతుండడంతో ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులకు సహాయంగా ఉండేందుకు వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఇంటి బయట లైట్లు ఆపేందుకు వచ్చిన అజ్మత్ అలీని కారిడార్లో అప్పటికే కాపుకాసి ఉన్న ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులతో బెదిరించి దాడి చేశారు. హాలులోకి లాక్కొచ్చి వృద్ధుడితోపాటు భార్య, ఇద్దరు కుమార్తెలనూ కాళ్లు, చేతులు కట్టేసి బంధించారు. అల్మారాలోని నగదు, భార్య, కుమార్తెల బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు రెండు ఖరీదైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు.

అనంతరం వారిని గదిలో బంధించి అద్దెకు ఉంటున్న వారు పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలతో పారిపోయారు. ఈ క్రమంలో దుండగులు తీసుకువచ్చిన ఒక డమ్మీ తుపాకీ అక్కడే పడిపోయింది. పొరుగింటి వారి సాయంతో కుమార్తెలు తలుపులు తెరిచి పోలీసులకు సమాచారమిచ్చారు. లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బంకులో ఒక బైక్లో పెట్రోల్ నింపుకొన్న దుండగులు, మరో ద్విచక్ర వాహనంలో ఇంధనం నింపడానికి ప్రయత్నించినా ట్యాంకు మూత తెరచుకోక వెళ్లిపోయారు. ఆ సమయంలో రెండు వాహనాలపై ఐదుగురు ఉన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ మార్గంలో వారు ప్రయాణించి హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి ఎస్సారెస్పీ కాలువ వద్ద ద్విచక్రవాహనాలు వదిలి వెళ్లారు. వృద్ధుడి కుటుంబానికి స్థానికంగా పలు స్థిరాస్తులున్నాయి. ఈ క్రమంలో కుటుంబంలో కొన్ని రోజులుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. యూపీలోని మీరేట్ చెందిన తన పెద్దల్లుడిపైన అజ్మత్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. జూన్ 17న అతడు సమాచారం లేకుండా తమ కారు తీసుకెళ్లాడని కరీంనగర్ ఒకటో ఠాణాలో అలీ ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్ గౌష్ ఆలం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
దుండగులను పట్టుకోవడానికి మొత్తం 8 బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Also read

Related posts