కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన ఒక బైక్ చోరీ కేసు విచారణలో పోలీసులు 35 చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దకడబూరు మండలానికి చెందిన మహేష్‌ను అరెస్టు చేయగా, వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి విక్రయించినట్లు విచారణలో అంగీకరించాడు.
కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన ఒక బైక్ చోరీ కేసు విచారణలో పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. ఒక ద్విచక్ర వాహనం చోరీపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, చివరికి 35 బైకుల చోరీ వ్యవహారాన్ని ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి వివిధ ప్రాంతాల నుంచి చోరీకి గురైన 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదోనిలో ఓ వ్యక్తి తన బైక్‌ను పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న ఆదోని టూ టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పెద్దకడబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఒక బైక్ చోరీ కేసుపై ప్రశ్నించిన పోలీసులకు, విచారణలో మహేష్ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేస్తూ, మొత్తం 35 ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు అంగీకరించాడు. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఏ బైక్ చోరీ చేశాడు, వాటిని ఎవరెవరికి విక్రయించాడు అనే వివరాలను కూడా పోలీసులకు వెల్లడించాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టి, ఇప్పటికే విక్రయించిన దొంగ బైకులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒకే కేసు విచారణలో భారీ సంఖ్యలో చోరీకి గురైన వాహనాలను పోలీసులు రికవరీ చేయగలిగారు. స్వాధీనం చేసుకున్న బైకుల వివరాలను పరిశీలిస్తున్నామని, వాటి యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవల బైక్ చోరీకి గురైన వారు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలతో ఆదోని టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
బైక్ చోరీలను అలవాటుగా మార్చుకున్న మహేష్‌ను అరెస్టు చేసి, అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆదోని టూ టౌన్ పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినకూడదు? శాస్త్రాలు చెప్పిన అసలు కారణం ఇదే!
- జ్యేష్ఠ పౌర్ణమి మహత్యం: ఈ ఒక్క పూజతో జ్యేష్ఠా దేవి దోషం తొలగి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందా?
- మహాకాలేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే దక్షిణాభిముఖంగా ఎందుకు ఉంది? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యం!
- పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు





