SGSTV NEWS online
CrimeTelangana

అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. సీన్ కట్‌చేస్తే..




నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్న ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ ఉక్కుపాదం మోపారు. రాత్రి రాత్రే మెరుపు దాడులు నిర్వహించి సుమారు 100 వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీలను విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రహదారులు, చెక్‌పోస్టుల వద్ద రవాణా శాఖ సిబ్బంది మోహరించారు. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలు, టిప్పర్ల పని పట్టారు.ప్రధానంగా రోడ్ల నాణ్యతను దెబ్బతీస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్న మెటీరియల్స్ తరలించే వాహనాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రానైట్ఫ్లై ఆష్, ఇసుక, కంకర,సిమెంట్ తరలించే 100 వాహనాలు సీజ్ చేశారు అధికారులు.


ఈ స్పెషల్ డ్రైవ్‌లో రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ పాల్గొన్నారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు, జిల్లా రవాణా శాఖ అధికారులు, మోటారు వాహన తనిఖీ అధికారులు , అసిస్టెంట్ మోటారు వాహన తనిఖీ అధికారులు ఈ దాడుల్లో భాగస్వాములయ్యారు.


పరిమితికి మించి లోడుతో ప్రయాణించడం వల్ల రహదారులు ధ్వంసం అవ్వడమే కాకుండా, తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు మండిపడుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే వదిలేది లేదని, రాబోయే రోజుల్లోనూ ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతాయని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Also read

Related posts