SGSTV NEWS online
Andhra PradeshCrime

తిక్క కుదిరింది.. ట్రాఫిక్ డీసీపీపై సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు! వారిపై కేసు నమోదు



విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల భద్రత కోసం నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం అర్ధరాత్రి సమయంలో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, డ్రైవర్ల విధి నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.

ఈ తనిఖీలకు సంబంధించిన వీడియోను ఓ స్థానిక మీడియా ప్రతినిధి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో కింద కొందరు వ్యక్తులు డీసీపీని లక్ష్యంగా చేసుకుని అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి గౌరవానికి భంగం కలిగించేలా, ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కామెంట్లు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత మీడియా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసభ్య వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా ఖాతాల వివరాలను సేకరించేందుకు సంబంధిత ప్లాట్‌ఫారమ్‌ను సంప్రదించిన పోలీసులు, ఖాతాదారుల గుర్తింపుపై సమాచారం కోరినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Also read

Related posts