సిద్ధిపేట జిల్లా రాయ్‌పోల్ మండలంలో వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన శ్యామ్ చారి అనే యువకుడిని ఒక మహిళ కుటుంబ సభ్యులు కాళ్లు, చేతులు కట్టేసి, అత్యంత క్రూరంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. రాయ్‌పోల్ పరిధిలోని రాంసాగర్ గ్రామానికి చెందిన శ్యామ్ చారికి, అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో ఆ మహిళకు, ఆమె భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంత చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విరక్తి చెందిన భర్త.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.
శ్యామ్ చారి ఒంటరిగా దొరకడంతో
తమ కుటుంబం పరువు పోవడానికి, విడాకులు రావడానికి శ్యామ్ చారే కారణమంటూ మహిళ కుటుంబ సభ్యులు అతనిపై తీవ్ర పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 26న శ్యామ్ చారి ఒంటరిగా దొరకడంతో మహిళ బంధువులు, కుటుంబ సభ్యులు అతనిపై ఒక్కసారిగా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా అతని కాళ్లు, చేతులు కట్టేసి.. డ్రిప్ పైపులతో విచక్షణారహితంగా బాదారు. ఈ ఘోర దాడిలో శ్యామ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న శ్యామ్‌ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శ్యామ్ చారి కన్నుమూశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రాయ్‌పోల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న మహిళ కుటుంబానికి చెందిన దాదాపు 20 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





