SGSTV NEWS online
Andhra PradeshCrime

ఖాకీలో కామాంధుడు..? రైటర్ బాగోతం బట్టబయలు!

ప్రకాశం: ఆమె ఒక మహిళా కానిస్టేబుల్, అతడు అదే పోలీసు
స్టేషన్లో రైటర్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సదరు రైటర్ బాధ్యతను విస్మరించి మహిళా కానిస్టేబుల్ తో అనుచితంగా ప్రవర్తించాడు. సాక్షాత్తు పోలీసు స్టేషన్లోనే జరిగిన ఈ ఘటనను ఎంత దాచి పెట్టాలనుకున్నా ఆ నోటా ఈ నోటా పడి గుప్పుమంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని అత్యంత ప్రధానమైన ఒక పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక రైటర్ మూడు రోజుల క్రితం అదే స్టేషన్లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం.

దీంతో మనోవేదనకు గురైన మహిళా కానిస్టేబుల్ రైటర్ తీరుపై మండి పడటమే కాకుండా ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం బయటకు రాకుండా చూసేందుకు రంగంలోకి దిగిన అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలోని ఒక వర్గం మహిళా కానిస్టేబుల్ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా రైటర్ వేధింపులతో విసుగు చెందిన కొందరు కానిస్టేబుళ్లు ఇదే అదనుగా ఈ ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో అసలు విషయం బట్ట బయలైంది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ రైటర్ తోపాటు మహిళా కానిస్టేబుల్ ను కూడా వీఆర్ కు పంపించారు. అయితే రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని తన మీద వీఆర్ వేటు పడకుండా సదరు రైటర్ మెడికల్ లీవ్ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మహిళల రక్షణ కోసమంటూ ఎస్పీ దండయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే మరోవైపు పోలీసు స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్ తో ఒక రైటర్ అనుచితంగా ప్రవర్తించడం దారుణమని కొరుక్కుంటున్నారు.

తొలినుంచి అదే ధోరణి…

మహిళా కానిస్టేబుల్ తో అనుచితంగా ప్రవర్తించిన సదరు రైటర్ పై తొలి నుంచి అనేక ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మద్దిపాడు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించినప్పుడు అదే పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆయన మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన మీద వీఆర్ వేటు వేసి కొన్నాళ్లకు తాళ్లూరు పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడకు వచ్చిన తర్వాత ఒక సాధారణ మహిళను వేధించడం మొదలు పెట్టాడని, బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని, దాంతో ఆయనను మార్కాపురానికి బదిలీ చేశారు.

మార్కాపురంలో ఒక మహిళా హోం గార్డు వెంట పడడం, అది కాస్త రచ్చ కావడంతో ఆయన్ను పామూరుకు బదిలీ చేశారని చెబుతున్నారు. అయితే అతడి వద్ద రైటింగ్ స్కిల్స్ ఉండటాన్ని గమనించిన ఒక సీఐ అతడ్ని సింగరాయకొండకు తెచ్చుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పోలీసు శాఖలో చక్రం తిప్పిన పచ్చ పార్టీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ సహకారంతో మెమో మీద ఒంగోలుకు  వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఇక్కడికే డీఓ తెచ్చుకున్నారు. అధికార పార్టీలో ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఒంగోలుకు వచ్చినప్పటి నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ మీద కన్నేసి వేధిస్తున్నాడని, సీఐని గుప్పిట్లో పెట్టుకొని మిగతా సిబ్బందినీ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సదరు రైటర్ వేధింపుల పర్వం కొనసాగుతున్నా స్పెషల్ బ్రాంచి సిబ్బంది ఎస్పీ దృష్టికి తీసుకెళ్లలేదని, దాంతో అతడి ఆగడాలు మితిమీరిపోయాయని పోలీసులు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు కూడా అధికారులు తననేమీ చేయలేరని, త్వరలోనే అద్దంకికి వస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది.

Also read

Related posts