లండన్ చదువు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఫ్రెండ్ అని నమ్మితే కొంపముంచాడు!
40 తులాల బంగారం, ఫ్లాట్ నొక్కేసి.. భార్య ఫ్రెండ్స్ వద్ద కోటి రూపాయల అప్పు!
నిలదీస్తే ‘అంబర్‌పేట్ శంకర్’ పేరుతో బెదిరింపులు..
హాస్పిటల్‌లో బాధితురాలు.. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
హైదరాబాద్ :ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. తీరా చూస్తే అసలు స్వరూపం బయటపెట్టాడు. నమ్మిన భార్యను నట్టేట ముంచడమే కాకుండా, అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చిన ఒక కిరాతక భర్త ఉదంతం హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది..
*కథేంటంటే..*
హైదరాబాద్ రాంపల్లికి చెందిన మనీషా లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఉప్పల్‌కు చెందిన సంతోష్ రెడ్డి ఆమెకు క్లాస్‌మేట్, మంచి ఫ్రెండ్. ఈ క్రమంలోనే మనీషాను ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన సంతోష్ రెడ్డి, పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమెను ఇండియాకు రప్పించాడు. తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నానని కలరింగ్ ఇచ్చాడు. అతని మాటలు నమ్మి 2025లో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు 40 తులాల బంగారం, ఒక ఫ్లాట్‌ను కట్నంగా సమర్పించారు.
*అప్పులు.. వేధింపులు..*
పెళ్లయిన తర్వాత సంతోష్ రెడ్డి అసలు రంగు బయటపడింది. భార్య మనీషాకు తెలియకుండా ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద సుమారు కోటి రూపాయల వరకు అప్పులు చేశాడు. ఈ డబ్బుల విషయం బయటపడటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. దీనికి తోడు అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు మనీషాను వేధించడం ప్రారంభించారు. “నిన్ను అమ్మేసైనా నా అప్పులు తీర్చుకుంటా” అంటూ అత్తింటివారు తీవ్రంగా వేధించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
*”నన్ను మోసం చేశావని నిలదీస్తే.. నా వెనుక అంబర్‌పేట్ శంకర్, అతని అనుచరులు ఉన్నారంటూ నన్ను, నా తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.”*
*— బాధితురాలు మనీషా*
*హాస్పిటల్‌లో బాధితురాలు.. న్యాయం కోసం వేడుకోలు*
ఇటీవలే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగా.. సంతోష్ రెడ్డి ఒక్కసారిగా రెచ్చిపోయి మనీషా, ఆమె తల్లిదండ్రులపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మనీషా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు, తన తల్లిదండ్రులకు భర్త సంతోష్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆసుపత్రి బెడ్‌పై నుంచే ఒక వీడియో ద్వారా వేడుకుంది.
ప్రస్తుతం
మనీషా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Also read
- ప్రేమ.. పెళ్లి.. కోటి రూపాయల మోసం! భార్యపై భర్త, అత్తింటి వారి దారుణ దాడి
- రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర
- సహజీవనం.. మహిళ నాలుక కోసి పారిపోయిన ప్రియుడు
- ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!
- కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!





