SGSTV NEWS online
Andhra PradeshCrime

ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది.. అసలు ఏం జరిగిందంటే?



పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎర్రసామంతవలస సమీపంలో విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు వైఎస్ వలస గ్రామానికి చెందిన పీడిక నవీన్ (24)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


కొట్టుకొమ్మలను తొలగిస్తూ కరెంటు షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలో విద్యుత్‌ తీగలకు తగులుతున్న చెట్టుకొమ్మలను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కరెంట్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపట్టారు. అయితే ఈ పనులు జరిగే ప్రాంతంలో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ లైన్లు ఉండడంతో పనులు స్టార్ట్ చేసే ముందే వాటికి విద్యుత్‌ ఆపేయాల్సి ఉంది. కానీ అధికారులు కేవలం 11 కేవీ లైన్‌కు మాత్రమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి 33 కేవీ లైన్‌కు ఆపేయడం మర్చిపోయారు.


ఈ విషయం తెలియక విద్యుత్ శాఖకు కాంట్రాక్ట్‌ బేస్‌ కింద పనిచేస్తున్న నవీన్ అనే యువకుడు చెట్టు ఎక్కి కొమ్మలు నరికే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతను ఉపయోగిస్తున్న కత్తి అదుపుతప్పి 33 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో భారీ విద్యుదాఘాతం సంభవించింది. ఈ ప్రమాదంలో కరెంట్‌ షాక్‌కు గురైన నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

తమ కుమారుడి మరణానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకుమారుడి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts