.
గుంటూరు నగరంలో కంకరగుంట గేటు సమీపంలోని నిర్మలా వైన్స్.. సోమవారం రాత్రి వైన్స్ పైన ఉన్న రూమ్ మందుబాబులతో కోలాహాలంగా ఉంది. బుంగ బాలకృష్ణ, మారుతి పూర్ణచంద్రరావు ఇద్దరూ స్నేహితులు.. ఒక టేబుల్ వద్ద కూర్చొని మద్యం తాగుతున్నారు. వీరికి ఎదురుగా ఉన్న మరొక టేబుల్ వద్ద అన్నదమ్ములైన దేవరకొండ స్వరూప్ నగర్, శశికుమార్ కూడా మద్యం సేవిస్తున్నారు. అయితే, కొద్ది సేపటి తర్వాత అన్నదమ్ములిద్దరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. దీంతో పూర్ణ చంద్రరావు వారివైపు చూశాడు. పూర్ణ చంద్రరావు చూడటాన్ని గమనించిన అన్నదమ్ములు ఏంటీ చూస్తున్నావంటూ గొడవకు దిగారు. మాటా మాట పెరగడంతో స్నేహితులు ఆ టేబుల్ వద్ద నుండి పక్కకు వెళ్లారు. అయినా అన్నదమ్ములిద్దరూ వదల్లేదు. మరొకసారి పూర్ణ చంద్రరావు వద్దకు వచ్చి ఘర్షణ పడ్డారు. ఇదే సమయంలో బీరు బాటిల్ పగలగొట్టిన అన్నదమ్ములు పూర్ణ చంద్రరావుపై దాడి చేయబోయారు. దీంతో భయబ్రాంతులకు గురైన పూర్ణచంద్రరావు అక్కడ నుండి పారిపోయాడు.
అదే సమయంలో బాలక్రిష్ణ కూడా పారిపోయే ప్రయత్నం చేయగా స్వరూప్ కుమార్, శశికుమార్ లు అతన్ని పట్టుకున్నారు. అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా పై అంతస్తు నుండి తలకిందులుగా వేలాడదీసి గుండెలపై పిడి గుద్దులు గుద్దారు. ఇదంతా గమనించిన వైన్స్ లోని సిబ్బంది అన్నదమ్ములిద్దరిని అడ్డుకొని బాలక్రిష్ణను విడిపించారు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ బాలక్రిష్ణ కిందకు వచ్చాడు.
అయితే, అన్నదమ్ములిద్దరూ కూడా కిందకు వచ్చి మరోసారి బాలక్రిష్ణపై దాడి చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి గందరగోళం నెలకొంది. వెంటనే నగరం పాలెం పోలీసులు రంగంలోకి దిగి అన్నదమ్ములిద్దరిని కట్టడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులపై కూడా తిరగబడ్డారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో అన్నదమ్ములిద్దరూ గలటా సృష్టించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకొని నగరంపాలెం పిఎస్ కు తరలించారు.
అయితే, అన్నదమ్ములిద్దరిపై పలు స్టేషన్లలో కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వరూప్ కుమార్ పై నర్సరావుపేట 2టౌన్, లాలాపేట, నగరంపాలెం స్టేషన్లతో కేసులుండగా శశి కుమార్ పై నగరంపాలెం పిఎస్ లో పాత కేసులున్నాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని గట్టిగా మందలించిన పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఉపేక్షించమని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అన్నదమ్ములిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నువ్వు బంగారు బాతువు’.. హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు వైరల్
- రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!
- తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!
- తుపాకీ మిస్‌ఫైర్.. హెడ్‌కానిస్టేబుల్ ఛాతీలో దిగిన బుల్లెట్
- మహిళా పోలీసు ఆత్మహత్య





