మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి, శాస్త్రిచౌక్కు చెందిన ప్రేమ్ కుమార్ రాజు బర్ల (30) బతుకుతెరువు కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. చిక్కడపల్లి రిసాల అంబేద్కర్ నగర్ లో తన భార్య నాగమణితో కలిసి నివసిస్తున్నారు. వీరికి వివాహమై రెండేళ్లు అవుతోంది. దంపతులిద్దరూ కలిసి ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని శ్రీకర హాస్పిటల్లో ఒక క్యాంటీన్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
చిన్న మొత్తం.. పెద్ద శాపమై..
గతంలో తన అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా ప్రేమ్ కుమార్ రూ.3 వేల రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రేమ్ కుమార్‌కు ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
రుణం చెల్లించడంలో జాప్యం జరిగితే, ప్రేమ్ కుమార్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలుగా మారుస్తామని ఏజెంట్లు హెచ్చరించారు. వాటిని కుటుంబ సభ్యులకు పంపడమే కాకుండా, సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని అత్యంత దారుణంగా బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. వరుస కాల్స్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురైన ప్రేమ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో ప్రేమ్‌కుమార్ మంగళవారం రాత్రి తన అద్దె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
భార్య నాగమణి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఫోన్లోని కాల్ డేటా, లోన్ యాప్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్ఐఐ అభిలాష్‌లు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Also read
- పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి
- కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
- కేపీహెచ్బీలో దారుణం.. మూడంతస్తుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
- లడ్డులో కల్తీ లేదని ఎక్కడుంది?
- మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్‌ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే..





