ఎమ్మెల్యే శ్రీధర్ చుట్టూ ముసురుకున్న లైంగిక వేధింపుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో బాధితురాలైన మహిళా ప్రభుత్వ ఉద్యోగి వీణ, తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వీణ తరపు న్యాయవాది మాట్లాడుతూ, బాధితురాలికి న్యాయం చేసేందుకు తాము ఎంతటి న్యాయ పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ డిజిపికి ఫిర్యాదు చేయడంతో పాటు, ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే తరపు వారు చేస్తున్న వాదనలను ఖండిస్తూ, బాధితురాలి వద్ద ఉన్న ఆధారాలు డీప్ ఫేక్ లేదా ఏఐ సృష్టించినవి కావని, అవన్నీ ఫోరెన్సిక్ తనిఖీలకు నిలబడతాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఒక క్లయింట్ కోసం పోరాడే బాధ్యతగా మాత్రమే దీన్ని తీసుకున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని న్యాయవాది స్పష్టం చేశారు.
బాధితురాలు వీణ తన గోడును వెళ్లగక్కుతూ, ఈ వివాదం 2024 జూన్ 14న ఫేస్బుక్ ద్వారా ప్రారంభమైందని తెలిపారు. తొలుత మర్యాదపూర్వకంగా పలకరించిన ఎమ్మెల్యే, ఆ తర్వాత క్రమంగా వ్యక్తిగత వివరాలు సేకరించి తన అసలు రూపాన్ని బయటపెట్టారని ఆరోపించారు. అధికార గర్వంతో తనను లోబర్చుకునే ప్రయత్నం చేశారని, కలవడానికి నిరాకరిస్తే ప్రమోషన్లు, బదిలీల విషయంలో అడ్డుకుంటానని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. జూలై 9వ తేదీన బలవంతంగా కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని వీణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే తన జుట్టు పట్టుకుని లాగి, ఫోర్స్ ఫుల్ గా ప్రవర్తించారని మీడియా సాక్షిగా వివరించారు.
ఈ దారుణం ఎవరికైనా చెబితే తన మూడేళ్ల బాబుకి ప్రాణహాని తలపెడతానని ఎమ్మెల్యే భయపెట్టారని ఆమె ఆరోపించారు.
ఈ క్రమంలో తాను గర్భవతిని కూడా అయ్యానని, అయితే ఎమ్మెల్యే అబార్షన్ చేయించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని వీణ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అబార్షన్ కు నిరాకరిస్తే తన ఇంటికి వచ్చి మరీ కొట్టారని, తన భర్తకు విడాకులు ఇప్పిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేయించారని ఆమె పేర్కొన్నారు. తాను మోసపోతున్నానని గ్రహించి ఆధారాలను టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా దాచుకున్నట్లు తెలిపారు. అయితే, ఇటీవలే జనవరి 7, 2026న ఎమ్మెల్యే తనను పెళ్లి చేసుకోనని ముఖం చాటేయడంతో పాటు, తన భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు తీసుకోమని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్త, కుటుంబ సభ్యులు తనను దూరం పెట్టారని, తన బాబును కూడా తన వద్ద ఉండనివ్వడం లేదని వీణ వాపోయారు. ఎమ్మెల్యే శ్రీధర్ కు తాను రూ. 7 లక్షలు అప్పుగా కూడా ఇచ్చానని, ఆర్థికంగా, శారీరకంగా తనను వాడుకుని వదిలేశారని ఆమె దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే శ్రీధర్ తన అధికార బలంతో పోలీసులను, తన చుట్టూ ఉన్న వ్యవస్థను వాడుకుంటూ తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని బాధితురాలు ఆరోపించారు. తాను ఎన్నిసార్లు ఆయన పెద్దలను కలవడానికి వెళ్లినా ఎవరూ స్పందించలేదని, పైగా తననే దోషిగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక మహిళా ఉద్యోగి ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు రక్షణ కల్పించాలని, తన బాబును తనకు దక్కేలా చేయాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీధర్ వీటిని డీప్ ఫేక్ వీడియోలని కొట్టిపారేయడం కేవలం తప్పించుకునే ప్రయత్నం మాత్రమేనని, ఫోరెన్సిక్ పరీక్షల్లో నిజాలు బయటకు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also read
- పిజిఆర్ఎస్ ఫిర్యాదులను పరిష్కరించని గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది…
- తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..?
- హనుమాన్ జయంతి 2026: హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!




