SGSTV NEWS online
CrimeTelangana

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం.. రూ.16 లక్షలకు బేరం.. చివరికి ఏమైందంటే?



నల్లగొండ జిల్లాలో నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగిని విధుల్లో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసి నగదు, కంప్యూటర్, ప్రింటర్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.



చనిపోయిన శవాలతో రాజకీయం చేయడం చూశాం.. కానీ అదే శవాల పేరుతో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలనే కొల్లగొట్టే ‘కారుణ్య రక్కసులు’ నయా స్కామ్‌కు తెరలేపారు. పదవీ విరమణ చేసి.. ప్రశాంతంగా కన్నుమూసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మ కూడా ఘోషించేలా.. బతికుండగానే అతడిని చంపేసి.. సర్వీసులోనే ఉన్నట్టు నకిలీ కాగితాలు పుట్టించి.. లక్షల రూపాయలు చేతులు మార్చి.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్నే లాగేసుకున్నారు. కట్ చేస్తే.. సీన్ రివర్సయింది. ఖాకీల ఎంట్రీతో ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టయింది. కేటుగాళ్లను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.


నల్లగొండ జిల్లా శాలిగౌరారం PHC లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు గత ఏడాది 2025 మే 31న పదవీ విరమణ పొందారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అదే ఏడాది నవంబర్ 17న మృతి చెందారు. స్వగ్రామమైన నకిరేకల్ మండలం ఒగోడులో దశదిన కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మృతుడి సహోద్యోగులు శాలిగౌరారం PHC సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి, మృతుడి బంధువులైన చామకూరి రాజశేఖర్, చామకూరి రవీందర్ హాజరయ్యారు.


మోసానికి పన్నిన కుట్ర..

మృతుడు వెంకటేశ్వర్లు ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే, ఆయన కుమారుడైన చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ప్లాన్ వేశారు. శాలిగౌరారం PHC సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి, మృతుడి బంధువులైన చామకూరి రాజశేఖర్, మీ సేవా AO, హెల్త్ అసిస్టెంట్ చామకూరి రవీందర్, రాచకొండ వెంకటేశ్వర్లు, మృతుడి భార్య చామకూరి వసంత, కుమారుడు చామకూరి రాజుతో కలిసి స్కెచ్ వేశారు. ఇందు కోసం 16 లక్షల రూపాయలు ఒప్పందం చేసుకున్నారు.


ఆధార్ చిరునామా మార్పు.. నకిలీ డెత్ సర్టిఫికెట్ తయారీ

మృతుడి బంధువులైన రాజశేఖర్, రవీందర్ సమన్వయంతో నల్లగొండలోని మీ సేవా కేంద్రం నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ ద్వారా మృతుడి ఆధార్ కార్డులో చిరునామాను మార్చారు. నల్లగొండ పట్టణంలోని DVK రోడ్డులో చైతన్యపురి కాలనీ, వార్డు నంబర్ 10, ఇంటి నంబర్ 500/1లో నివసిస్తున్నట్లు తప్పుడు చిరునామా నమోదు చేయించారు. మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, మీ సేవా AO రాజశేఖర్, మీ సేవా కేంద్ర నిర్వాహకుడు చందు తదితరులు కుమ్మక్కైయ్యారు. ఈ తప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా చామకూరి వెంకటేశ్వర్లు 28-05-2025న విధుల్లో ఉండగానే మృతి చెందినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు.

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం..
నకిలీ డెత్ సర్టిఫికెట్ ఆధారంగా మృతుడి కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించేందుకు శాలిగౌరారం PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప.. సంబంధిత దరఖాస్తు ఫైలును DMHO కార్యాలయానికి పంపించారు. DMHO కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్, జూనియర్ అసిస్టెంట్ తుంగతుర్తి మోహన్ కృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహబూబ్ అలీ, AO జితేందర్ రెడ్డి, DMHO CC పోలె రంజిత్ కుమార్,శాలిగౌరారం PHC సీనియర్ అసిస్టెంట్ జగన్నాధ రెడ్డిలు కలిసి తప్పుడు విచారణ నివేదికలు రూపొందించి DMHOకు సమర్పించారు. ఈ తప్పుడు పత్రాల ఆధారంగా మృతుడి కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల PHCలో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.

స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..
ఇదంతా సాఫీగా జరుగుతున్న సమయంలోనే నకిలీ డెత్ సర్టిఫికెట్ తో కారుణ్య నియామకం పొందినట్లు బయటకు పొక్కింది. నల్లగొండ మున్సిపాలిటీ నుండి నకిలీ డెత్ సర్టిఫికెట్ జారీ అయినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ డొంక కదిలింది. ఈ కేసులో14 మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు.

Also read

Related posts