April 27, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)అను మహిళను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

TG Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఇస్లావత్ దీపిక (19)కు ఆరు నెలల క్రితం వెంకట్యాతండా స్టేజీకి చెందిన బోడా శ్రీనుతో వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దికాలం దాంపత్య జీవితం అనుకూలంగా సాగింది. కానీ వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెపై భర్త శ్రీను, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. గత రెండు నెలలుగా దీపికపై నిరంతర వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది.

ప్రాణం తీసిన అదనపు కట్నం..
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగినది. దీపికను భర్త శ్రీను, అత్తమామలు కలిసి దాడి చేశారు. సాయంత్రానికి పరిస్థితి మరింత విషమంగా మారింది. భర్త శ్రీను కూల్‌డ్రింక్‌లో పురుగుమందు, ఎలుకల మందు కలిపి దీపికకు తాగించాడు. దీని తరువాత తాను కూడా అదే విషపు మిశ్రమాన్ని తాగాడు. దీనివల్ల ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని ఖమ్మంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న దీపిక పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే మృతి చెందింది. శ్రీను పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీపిక తండ్రి వత్మాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయస్సులోనే గర్భంతో ఉన్న కూతురును కోల్పోయిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలాంటి ఘోరమైన చర్యకు ఒడిగట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపికకు న్యాయం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు

Also read

Related posts

Share via