July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం

ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

వైకాపాకు కొమ్ముకాసే డీఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపింది ఎవరు?

అనంతపురం ఎస్పీకీ తెలియదట!

అమరావతి, – తాడిపత్రి: ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య దాదాపు రెండున్నరేళ్లపాటు తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశారు. వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా, ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారు. తెదేపా నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులకు దిగి, వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకుల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా ఫిర్యాదిస్తే చాలు వారిపై రివర్స్ కేసులు పెట్టి హింసించారు. పాత కేసులన్నీ తిరగదోడారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంగితం ఉన్న అధికారులెవరైనా చైతన్యలాంటి అరాచక అధికారిని తాడిపత్రికి పంపిస్తారా? ఘనత వహించిన పోలీసు  ఉన్నతాధికారులు మాత్రం ఘర్షణలను అదుపు చేసేందుకంటూ మంగళవారం అర్ధరాత్రి చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి పంపించారు. వైకాపా, ఆ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై వీరవిధేయతను, వారి అరాచకాలకు కొమ్ముకాసే చైతన్య.. ఇదే అదనుగా పేట్రేగిపోయారు. తన బృందంతో కలిసి తాడిపత్రిలోని తెదేపా నేత జేసీ ప్రభాకర్రెడ్డి నివాసంలోకి మంగళవారం అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడున్న తెదేపా కార్యకర్తలను లాఠీలతో కొట్టారు. 35 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఎక్కడికో తరలించారు. ఈ ఘటన వెలుగుచూశాక పోలీసు ఉన్నతాధికారులు ఎవరికి వారే చైతన్య తాడిపత్రికి ఎలా వచ్చారో.. ఎవరు పంపించారో తమకు తెలియదంటూ తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు.

అరాచక అధికారిని ఎవరు పిలిపించారు?

వైకాపా హయాంలో తాడిపత్రి ఏడాది పొడవునా రావణకాష్టంలా రగులుతూనే ఉంది. 2020 అక్టోబరు నుంచి 2023 ఏప్రిల్ వరకూ దాదాపు రెండున్నరేళ్లపాటు డీఎస్పీగా పనిచేసిన చైతన్య.. వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి  పెద్దారెడ్డికి కొమ్ముకాశారు. ఇప్పుడు తన విధి నిర్వహణ కేంద్రమైన అన్నమయ్య జిల్లా రాజంపేటను విడిచిపెట్టి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళితే అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎస్పీలకు, అనంతపురం రేంజ్ డీఐజీకి తెలియదా? శాంతిభద్రతల విభాగం ఏడీజీకి, డీజీపీకి తెలియదా? నిఘా విభాగాధిపతికి తెలియదా? చైతన్యను తాడిపత్రికి ఎవరు పిలిపించారో తనకు తెలియదని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ చెబుతున్నారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఏముంటుంది? వారంతా ఏం చేస్తున్నారు? ఘర్షణలకు మరింత ఆజ్యం పోసే అధికారిని పంపడమేంటి? దీని వెనక ఎవరున్నారో సమగ్రంగా విచారించాల్సి ఉంది. నిజంగానే ఎవరి ఆదేశాలు లేకుండానే చైతన్య తాడిపత్రి వెళ్లి దాడి చేసుంటే సస్పెండ్ చేయాలి. సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలి. అలాకాకుండా ఎవరైనా ఆదేశమిచ్చి తాడిపత్రికి పంపిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి 

జేసీ, తెదేపా వర్గీయులే లక్ష్యంగా దాడులు

జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మారణాయుధాలతో వెళ్లి హల్చల్ చేయడం గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదంతా డీఎస్పీ చైతన్య కనుసన్నల్లోనే జరిగింది. అప్పట్లో తెదేపా వారిపైనే కేసులు నమోదు చేసి చైతన్య స్వామిభక్తిని చాటుకున్నారు. యాడికి మండలం కోనఉప్పలపాడుకు చెందిన కొంతమంది తెదేపా వర్గీయులను స్టేషన్కు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టి చేతివేళ్లు విరగ్గొట్టారు.

• తాడిపత్రి పురపాలిక తెదేపా కౌన్సిలర్లనూ కొడుతూ దుర్భాషలాడిన సంఘటనలూ ఉన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన వర్గీయులు ఆదాయ మార్గాలను అక్రమంగా పెంచుకునే క్రమంలో చూసీచూడనట్లు వ్యవహరించారు. వారు ఇసుకను ఆదాయవనరుగా భావించి ఇష్టారాజ్యంగా తరలించినా కేసులు నమోదు చేయలేదు.

• మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాలను బాగు చేసేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి ‘భిక్షాటన’ కార్యక్రమాల తలపెడితే ఆయన్ని గృహనిర్బంధం చేశారు. ఇలా జేసీని మూడు దఫాలుగా డీఎస్సీ చైతన్య పోలీసు  బలగాలతో అడ్డుకున్నారు.

23 ప్రైవేటు కేసులు

చైతన్య బాధితులు ఆయనపై ఏకంగా 23 ప్రైవేటు కేసులు వేశారు. ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్రెడ్డి 2022 జూన్ 11న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తెదేపా కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జునపై దాడి చేశారు. దీనిపై మల్లికార్జున వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే హర్షవర్ధన్రెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చలేదు. విచారణ పేరిట డీఎస్పీ చైతన్య తనను పిలిపించి ‘ఎమ్మెల్యే కుమారుడిపైనే కేసు పెట్టమంటావా? ‘ అంటూ కొట్టారని మల్లికార్జున అప్పట్లో వాపోయారు. డీఎస్పీపై ఎస్సీ కమిషన్కు బాధితుడు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు కేసు వేశారు. ఇది జరిగిన వెంటనే వైకాపా నాయకులు మల్లికార్జునపై దాడికి తెగబడ్డారు. అయినా ఆ నాయకులపై ఎలాంటి చర్యలు లేవు.

Also read

Related posts

Share via