హాస్టల్ గదిలో అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. అయితే విద్యార్థిని మృతికి ర్యాగింగే కారణమై ఉండొచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధి వరంగల్ నగరంలోని కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న ఆమె రాత్రి సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపగా.. ఆమె ఆత్మహత్యపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లాకు చెందిన గుంటోజు సత్యనారాయణాచారి కి ఇద్దరు కూతుళ్లు. అందులో చిన్న కూతురు గుంటోజు రేష్మిత(19) అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో వరంగల్ పైడిపల్లి సమీపంలో ఉన్న రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఏఆర్ఎస్)లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. స్వగ్రామం నల్గొండ కావడంతో ఇక్కడే ఉన్న హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది. ఇంతవరకు బాగానే ఉండగా, మంగళవారం రాత్రి హాస్టల్ గదిలోకి వెళ్లిన రేష్మిత బుధవారం తెలవారినా బయటకు రాలేదు.
ఈ నేపథ్యంలో అక్కడున్న హాస్టల్ సిబ్బంది డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలోంచి పరిశీలించగా.. రేష్మిత ఉరి వేసుకుని కనిపించింది. దీంతో కంగారు పడిపోయిన సిబ్బంది వెంటనే కాలేజీ అధికారులతో పాటు ఏనుమాముల పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోకి చూడగా రేష్మిత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. అనంతరం పోలీసులు, కాలేజీ, హాస్టల్ సిబ్బంది రేష్మిత తండ్రి సత్యనారాయణకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన నల్గొండ నుంచి రేష్మిత ఉండే హాస్టల్ కు చేరుకున్న తరువాత డెడ్ బాడీని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ర్యాగింగా.. మరే ఇతర కారణమా..?
రేష్మిత ఆత్మహత్యకు కాలేజీ ర్యాగింగ్ కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. కాలేజీలో కొద్ది రోజులుగా ర్యాగింగ్ జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో రేష్మిత ర్యాగింగ్ భూతానికే బలై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే హాస్టల్ లో స్టూడెంట్లను పర్యవేక్షించాల్సిన వార్డెన్ కూడా అందుబాటులో లేకుండా పోయిందని తెలిసింది. హాస్టల్ వార్డెన్ హైదరాబాద్ కు వెళ్లినట్టు తెలుస్తుండగా.. కాలేజీ సిబ్బంది విషయం తెలియజేసిన అనంతరం ఆమె అక్కడి నుంచి హాస్టల్ కు వచ్చినట్లు సమాచారం. కాగా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హాస్టల్ లో ఉండాల్సిన వార్డెన్ అందుబాటులో లేకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రేష్మిత మృతిపై అనుమానం వ్యక్తం తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు చావుకు కాలేజీ యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు ఏనుమాముల పోలీసులు వివరించారు.
Also read
- Astro Tips: ఈ నెల 16న ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెట్టనున్న చంద్రుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారమే..
- Holi 2025: హోలీ నాడు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం..
- Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?