అనకాపల్లి పట్టణం: ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించింది భార్య. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి మృతుడి భార్య సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు.
డీఎస్పీ మాట్లాడుతూ.. “తురువోలుకి చెందిన డేగల చిన్న, కొండమ్మకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. చిన్న, అతని భార్య కొండమ్మ 2024లో వాకపల్లి గ్రామస్థులతో కలిసి తెనాలిలో కూలీ పనికి వెళ్లారు. ఇక్కడ కొండమ్మకు మేస్త్రీ గణేశ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త చిన్న.. కొండమ్మను తీసుకొని స్వగ్రామానికి వచ్చేశాడు. అయినా తరచూ కొండమ్మ.. గణేశ్‌తో ఫోన్లో మాట్లాడుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో చిన్నను అడ్డుతప్పించుకోవాలని భార్య కొండమ్మ భావించింది. విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో ఈనెల 14న తెనాలి నుంచి గణేశ్, అతడి బంధువు శివకుమార్ చోడవరం వచ్చారు. చిన్న.. ద్విచక్ర వాహనంపై తురువోలు వస్తుండగా దారిలో గణేశ్, శివకుమార్ దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. హత్యను రోడ్డు ప్రమాదం-చిత్రీకరించాలని ప్రయత్నించారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది” అని డీఎస్పీ వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య కొండమ్మ, ప్రియుడు గణేశ్‌తో పాటు హత్యకు సహకరించిన శివకుమార్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు.
Also Read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





