ప్రొద్దుటూరు…తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్టన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు
ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు.
తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీర్ణంచుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది.
దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క..
చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు.
దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు.
Also read
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..
- లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు.. టెక్కీ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలనాలు!
- Andhra: తనను పట్టించుకోని కూతురికి ఊహించిన ఝలక్ ఇచ్చిన వృద్ధురాలు..
- హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం





