SGSTV NEWS online
Andhra PradeshCrime

తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం



కాకినాడ: బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) మృతదేహాం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.


నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో.. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్ రూమ్ వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా?.. ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత.. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)కు చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి పోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.

ఈలోపు.. కాపలదారుడు వీడియో తీస్తుండడం గమనించి.. బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

నారాయణరావు అరెస్ట్ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు.

Also read

Related posts