October 17, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఇదేం లాజిక్ సామీ … ఆవులకు దాణా, మేత సరిగ్గాలేకే నెయ్యి నాణ్యత తగ్గిందా!



తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అధికార కూటమికి, ప్రతిపక్ష  వైసిపికి మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ క్రమంలోనే నెయ్యి నాణ్యత విషయంలో వైఎస్ జగన్ కామెంట్స్ పై కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తెగ ట్రోల్ చేస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా జగన్ పై  సెటైర్లు వేసారు.

Tirumala Laddoo : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని హిందువులు భక్తిశ్రద్దలతో కొలుస్తారు. ఏడు కొండలపై వెలిసిన శ్రీవారిని ఆపదమొక్కుల వాడు, అనాధ రక్షకుడిగా ఎంతలా నమ్ముతారో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా అంత పవిత్రంగా భావిస్తారు. తిరుమలకు వెళితే స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవడం అంతే ముఖ్యం. స్వయంగా ఆ శ్రీవారే ఈ లడ్డూ ప్రసాదాన్ని తమకోసమే తయారుచేయించారు అన్నట్లు భావించి కళ్లకు అద్దుకున్నాకే తింటారు.

కేవలం తెలుగు ప్రజలే కాదు యావత్ భారతీయ హిందువులంతా తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తారు. అందువల్లే దేశ నలుమూలలే కాదు విదేశాల్లోనూ తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తులున్నారు… ఆ ఏడుకొండలెక్కి ఆ దేవదేవుడిని దర్శించుకుని తరిస్తుంటారు. కాలినడకన తిరుమల కొండెక్కెవారు కొందరయితే… తలనీలాలు సమర్పించేవారు మరికొందరు… ఇలా శ్రీవారి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ లడ్డూ ప్రసాదం రుచిచూస్తారు… అంతేకాదు తమ ఇళ్లకు తీసుకెళ్లి చుట్టుపక్కలవారు, బంధువులకు పంచుతుంటారు.

ఇలా ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూపై వివాదం కొనసాగుతోంది. గత వైసిపి హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పవిత్య పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల మాంసంతో తయారుచేసిన నెయ్యిని వాడారంటూ బాంబ్ పేల్చారు. ఏపీ సీఎం వ్యాఖ్యలు కేవలం శ్రీవారి భక్తులనే యావత్ హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేసాయి.

ప్రస్తుతం తిరుమల లడ్డూ విషయంలో అధికార టిడిపి, జనసేన,బిజెపి కూటమి, ప్రతిపక్ష వైసిపి నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది.  తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వాడారని కూటమి… ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఇరు పార్టీలు పలు ల్యాబ్ రిపోర్టులను ఆదారాలుగా చూపిస్తున్నాయి. దీంతో ప్రజలు అసలు లడ్డూ తయారీ విషయంలో గతంలో ఏం జరిగింది? ప్రస్తుత సీఎం చెబుతున్నది నిజమా లేక మాజీసీఎం చెప్పేది నిజమా? అనే డైలమాలో వున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వైసిపి హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. గతంలో  వైఎస్ జగన్ దంపతుల వ్యవహార తీరు, టిటిడి ఛైర్మన్లుగా అన్యమతస్తులను నియమించారని గుర్తుచేస్తూ వైఎస్ జగన్ ను ఇరకాటంలో పెడుతోంది. అంతేకాదు వైఎస్ జగన్ మాటలపై కూడా టిడిపి సోషల్ మీడియా గ్రూప్స్ లో తెగ ట్రోల్ చేస్తున్నారు. చివరకు టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు కూడా జగన్ వదిలిపెట్టడం లేదు. ఇటీవల తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న వివాదంపై జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో పేర్కొన్న  అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు సెటైర్లు వేసారు.

కల్తీ నెయ్యి తప్పు మీది కాదా… ఆవులదేనా!

పవిత్రమైన తిరుమలలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ల్యాబ్ రిపోర్ట్స్ ను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది… అయినప్పటికీ వైసిపి నాయకులు, వైఎస్ జగన్ బుకాయిస్తుండటం సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీకి తాము కారణం కాదు… పాలిచ్చే ఆవులే కారణమని జగన్ అటున్నారని సీఎం ఎద్దేవా చేసారు.

నెయ్యి కల్తీ ఎందుకు అయ్యింది అంటే ఆవులు సరైన దాణా తినలేదు… గడ్డి సరిగ్గా వేయలేరు…అనారోగ్యంతో ఉన్నాయని అంటారా.! అందువల్లే ఆవుల పాలతో చేసిన నెయ్యి నాణ్యత తగ్గిందంటారా! అని చంద్రబాబు నిలదీసారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్వయంగా వైఎస్ జగన్ ఇలాంటి లాజిక్ లేని కారణాలు ప్రస్తావించారని చంద్రబాబు గుర్తుచేసారు. ఇలా అబద్దాలు మాట్లాడేవారిని వెంటనే సంఘ బహిష్కరణ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు

15 వేల కేజీల నెయ్యి తయారీకి 3.75 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి… ఇందుకోసం వేలాది ఆవుల నుండి పాల సేకరణ చేయాల్సి వుటుందని జగన్ పేర్కొన్నారట. ఇలా 37 వేల ఆవులకు మంచి గడ్డి, దాణా ఇవ్వలేదు… అందువల్లే ఆ పాలతో తయారుచేసిన నెయ్యి నాణ్యత దెబ్బతింది అని జగన్ చెప్తున్నాడని చంద్రబాబు అన్నారు. కరుడు గట్టిన నేరస్తులకే ఇలాంటి తెలివి, ఆలోచనలే వుంటాయంటూ చంద్రబాబు ఎద్దేవా చేసారు.

తప్పు జరిగిందని ఒప్పుకుని క్షషమాపణ చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అన్ని ఆవులకు అనారోగ్యం, దాణా సమస్య ఉందా? అని ప్రశ్నించారు. జగన్ లాంటి వ్యక్తితో రాజకీయం చేయడం జాతికే అవమానమంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.


తిరుమలకు పూర్వ వైభవం తీసుకువస్తాం

గత పాలకులు అహంభావంతో చేసిన నిర్వాకంతో తిరుమల పవిత్రను దెబ్బతీసారని చంద్రబాబు ఆరోపించారు. దైవ సన్నిధిలో వాళ్లు చేసిన అపచారానికి ఇప్పుడు   అందరం క్షోభ అనుభవించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చినవెంటనే శ్రీవారి సన్నిధిలో ప్రక్షాళన ప్రారంభించామని…  మళ్లి తిరుమలకు పూర్వవైభవం  తీసుకొస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఏదయినా తప్పులు చేస్తే క్షమించాలని బ్రహ్మోత్సాలకు ముందే పవిత్ర యాగం చేస్తారు… కానీ గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చాలారోజుల ముందే ఆ పని చేయాల్సి వస్తోందన్నారు. ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలో శాంతిహోమం, పంచగవ్య ప్రోక్షణ చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.


టీటీడీ బోర్డు చైర్మన్ గా అన్య మతస్తులు :

ఒక ముఖ్యమంత్రిగా కాదు సామాన్య శ్రీవారి భక్తుడిగా చెప్తున్నా…వెంకటేశ్వరస్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అని చంద్రబాబు అన్నారు. దాదాపు 300 ఏళ్లుగా ఈ లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయన్నారు. నాణ్యత లేని సరుకులు ఎక్కడా వినియోగించరు… ఈ సరుకులు సరఫరా చేసే వాళ్లు సైతం ఇచ్చేవాటిని పవిత్రంగా భావించి ఇస్తారన్నారు. ఇంట్లోకి తిరుమల లడ్డు తెచ్చి పెడితే ఇళ్లంతా సువాసన ఉంటుంది… వడ, పొంగలి ప్రసాదాలు దేనికదే ప్రత్యేకత ఉంటుందన్నారు.

టిటిడి ట్రస్ట్ బోర్డు నియామకాల్లో గ్యాంబ్లింగ్ చేశారు…చట్టాన్ని మార్చి 50 మంది నామినేటెడ్ పోస్టులు అని తీసుకొచ్చారని చంద్రబాబు తెలిపారు. ఎక్స్ అఫిషియో అనే విధానాన్ని తెచ్చి పెట్టారని గుర్తుచేసారు.టీటీడీ టికెట్లు ఇష్టానుసారంగా అమ్ముకున్నారని ఆరోపించారు. దేవుడిపై నమ్మకం లేని వాళ్లను బోర్డు ఛైర్మన్లుగా పెట్టారు … అన్యమతస్తులకే  ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాలకు టీటీడీని ఉపయోగించారని చంద్రబాబు మండిపడ్డారు. 

టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని మాట్లాడతారు… మరో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూతరు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారని చంద్రబాబు అన్నారు. ఇలాంటివారిని టిటిడి ఛైర్మనుగా నియమించడం ద్వారానే తిరుమల విషయంలో వైఎస్ జగన్ ఆలోచన ఎలా వుందో అర్థమవుతుందన్నారు. ప్రజలందరికి తెలుసు జగన్ ఎలాంటివాడో… ఆయినా ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also read

Related posts

Share via