ఇంటి పైనుంచి కిందికి తోసేయాలని చూశారు గోవా తీసుకెళ్లి బోటులో నుంచి నెట్టేయాలనుకున్నారు తలపై దిండు పెట్టి, మెడకు చున్నీ బిగించారు జోగి రమేష్ కుటుంబంపై కోడలి ఫిర్యాదులో నిర్ఘాంతపోయే విషయాలు
అమరావతి: ‘2025 మే 28న సూర్యాపేటలో జరిగిన మా వివాహం తర్వాత నా భర్త జోగి రాజీవ్ ఏ రోజూ నన్ను సరిగ్గా చూసుకోలేదు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. అత్తమామలు అతనికే వత్తాసు పలికారు’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జోగి రమేష్ కోడలు మేఘన ఆరోపించారు. ‘పెళ్లి సమయంలో ఇచ్చినవి చాల్లేదంటూ మరో రూ.5 కోట్ల కట్నం, ఫార్చ్యూనర్ కారు, అత్త, ఆడపడుచులకు వజ్రాలహారాలు చేయించి తీసుకురావాలని వేధించారు. నా ఆస్తులను రాజీవ్ పేరిట బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. ఒకరోజు ఇంటి టెర్రెస్ పైనుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే మరో వ్యక్తి కలిసి నన్ను తోసేయడానికి ప్రయత్నించారు. మరోరోజు అంతా కలిసి నా మెడకు చున్నీ బిగించి, ముఖంపై తలగడ పెట్టి చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే.. వారికి నా శవమే కనిపించేలా చేస్తామని బెదిరించారు’ అంటూ నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించారు.
భారీగా కట్నకానుకల డిమాండ్
పెళ్లిసమయం నుంచే అత్తింటివారి వేధింపులు ఆరంభమయ్యాయని మేఘన తన ఫిర్యాదులో తెలిపారు. ‘పెళ్లికి వచ్చిన అతిథులకు తిరుగు కానుకలుగా వెండి వస్తువులు ఇవ్వాలన్నారు. నా తల్లిదండ్రులు రూ.5 కోట్లతో పెళ్లి చేశారు. 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచుకు రూ.9 లక్షల కట్నంతో పాటు అనేక కానుకలు ఇచ్చాం. అయినా చాల్లేదని, అప్పటినుంచి వేధిస్తూనే ఉన్నారు. నా భర్తకు శారీరక సమస్య ఉందని తెలిసింది. అది దాచిపెట్టి మోసం చేశారు’ అని పేర్కొన్నారు. ‘నన్ను చాలారోజులు బంధించారు. రెండు రోజుల పాటు భోజనం కూడా పెట్టలేదు. నేను రోజూ ఉదయాన్నే పూజలు చేద్దామని అగర్బత్తీ వెలిగిస్తే.. శవం దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తోందని అవమానించేవాళ్లు. తర్వాతే వాళ్లంతా క్రైస్తవంలోకి మారారనే విషయం తెలిసింది’ అని మేఘన పేర్కొన్నారు.
గోవాకు తీసుకెళ్లి చంపాలని ప్రయత్నం
గోవాకు తన భర్త, బంధువులతో వెళ్లగా అక్కడా తనను ఒకసారి బోటులోంచి తోసేయడానికి ప్రయత్నించాడని, మరోసారి ఎవరూ లేనిచోట వదిలేసి వెళ్లిపోయాడని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోవా నుంచి తిరిగొచ్చాక.. హైదరాబాద్లోని నార్సింగిలో ఉన్న విల్లాకు తీసుకెళ్లి అక్కడ.. తన భర్తతో పాటు మామ జోగి రమేష్, మరికొందరు బంధువులు తనను కొట్టి, కాళ్లతో తన్ని, దిండుతో ముఖాన్ని మూసి చంపాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి నా భర్త, అత్త, మామ, ఆడపడుచు, మరిది కలిసి ఒకేసారి నాపై దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారు. మామ రమేష్ నా ముఖంపై దిండు బలంగా నొక్కిపెట్టారు. నా భర్త.. నా మెడకు చున్నీ బిగించి చంపడానికి ప్రయత్నించాడు. దీంతో భయంతో వాళ్ల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాను. వాళ్లు చెప్పినట్టే చేస్తానని వేడుకున్నాక.. విడిచిపెట్టారు’ అని మేఘన పేర్కొంది.
