SGSTV NEWS
Andhra PradeshCrime

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

వినుకొండ : పొట్ట కూటి కోసం వస్తున్న కూలీలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గడ్డమీద పల్లె, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దారుపల్లి తాండకు చెందిన ఆరుగురు రైతు కూలీలు మంగళవారం బొప్పాయి తోటలో కాయ కోసేందుకు బొలెరో ట్రక్లో పల్నాడు జిల్లా ఈపూరు వస్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరి బొండాల లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొంది.

ఈ ప్రమాదంలో గడ్డమీద పల్లె గ్రామానికి చెందిన పగడాల రమణారెడ్డి (45), పగడాల సుబ్బమ్మ (40) దంపతులు, దారుపల్లి తాండకు చెందిన జొన్నగిరి రామాంజి (35), జొన్నగిరి అంకమ్మ (28) దంపతులు మృతి చెందారు. లారీలో ఉన్న కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు.

పగడాల సుబ్బమ్మ, జొన్నగిరి అంకమ్మలు ఘటనా స్థలంలో మృతి చెందగా, రమణారెడ్డి, రామాంజిలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. వినుకొండ పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని వైద్యశాలకు, మృతదేహాలను మార్చురీకి తరలించారు.

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
అమరావతి : పల్నాడు జిల్లా వినుకొండ మండలం
శివాపురం వద్ద బొలెరో ట్రక్, లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Also read

Related posts

Share this