భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా రూ.6 లక్షలు ఇవ్వాలని గ్రామస్తులు ఒత్తిడి తేవడంతో ఆటో డ్రైవర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలివి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కుర్మాండ్ల శ్రీనివాస్ గౌడ్ ఆటో డ్రైవర్. జూన్ 25న రామాయంపేటనుంచి వస్తుండగా ఆటోను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల రమేష్ గౌడ్ మరణించాడు. దీనిపై పంచాయితీ చేసిన గ్రామస్తులు.. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల జరిమానా విధించారు.
శ్రీనివాస్ గౌడ్ లక్ష రూపాయలు చెల్లించి మిగతా రూ.5 లక్షలకు తన బావ అయిన సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన సిద్ధగౌడ్ను జమానత్గా ఉంచాడు. వాయిదా సమయం దాటినా డబ్బులు ఇవ్వకపోవడంతో.. మృతుడు రమేశ్ కుటుంబ సభ్యులను అతని బంధువు తీసుకెళ్లి జమానత్ ఉన్న సిద్ధగౌడ్ ఇంటి వద్ద వదిలాడు. ఈ క్రమంలో సిద్ధగౌడ్ భార్య సత్తవ్వ మనస్తాపానికి గురై కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో గ్రామస్తులు కల్పించుకుని తిరిగి పంచాయితీ నిర్వహించి రూ.3 లక్షలను చెల్లించాలని శ్రీనివాస్ గౌడ్ కు సూచించారు.
అంత డబ్బు తమ వద్ద లేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొనగా.. జరిమానా చెల్లించాల్సిందేనని గ్రామస్తులు ఆదేశించారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ అతడి భార్య లత మనస్తాపం చెంది ఇంటికి వెళ్లి పురుగు మందు తాగారు. స్థానికులు గమనించి వారిని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భిక్కనూరు ఎస్ఐ అనిల్ తెలిపారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్ గౌడ్ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





