Govardhan Puja 2026 Telugu: 2026లో గోవర్ధన పూజను నవంబర్ 10న జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని తన చిటికెన వేలిపై ఎత్తి బ్రజ్ ప్రజలను ఇంద్రుడి ఆగ్రహం నుంచి ఎలా కాపాడాడో తెలుసా? ఈ పర్వదినం వెనుక ఉన్న పురాణ కథ, అన్నకూట్ పూజ, ఆధ్యాత్మిక సందేశం గురించి తెలుసుకుందాం.
Govardhan Puja Story Telugu: దీపావళి తర్వాత వచ్చే ఆశ్వయుజ/కార్తీక శుక్ల పాడ్యమిని గోవర్ధన పూజగా జరుపుకుంటారు. దీనినే అన్నకూట్ పూజ అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని తన చిటికెన వేలితో ఎత్తి బ్రజ్ ప్రజలను ఇంద్రుడి ఆగ్రహం నుంచి కాపాడిన ఘట్టానికి గుర్తుగా ఈ పండుగను నిర్వహిస్తారు. ప్రకృతి పట్ల కృతజ్ఞత, పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, అహంకారంపై వినయం సాధించిన విజయానికి ఈ పర్వదినం ప్రతీకగా భావిస్తారు.
2026లో గోవర్ధన పూజ ఎప్పుడు?
2026లో గోవర్ధన పూజను నవంబర్ 10, మంగళవారం జరుపుకుంటారు. ఢిల్లీలో పంచాంగం ప్రకారం కార్తీక శుక్ల పాడ్యమి తిథి నవంబర్ 9 మధ్యాహ్నం 12:31 గంటలకు ప్రారంభమై, నవంబర్ 10 మధ్యాహ్నం 2:00 గంటలకు ముగుస్తుంది. ఉదయం పూజా ముహూర్తం 6:40 నుంచి 8:50 గంటల వరకు ఉంటుంది. ఈసారి దీపావళి నవంబర్ 8న జరగగా, గోవర్ధన పూజ నవంబర్ 10న రావడానికి పాడ్యమి తిథి సూర్యోదయానికి అనుసరించి లెక్కించడమే కారణం.
శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకు ఎత్తాడు?
పురాణ కథనం ప్రకారం బ్రజ్ ప్రజలు వర్షాలు, పంటలు, సిరిసంపద కోసం ఇంద్రుడిని పూజించేవారు. అయితే శ్రీకృష్ణుడు వారికి ప్రకృతి, గోవులు, పచ్చిక బయళ్లు, గోవర్ధన గిరి తమ జీవనాధారాలని వివరించాడు. అందువల్ల ఇంద్రుడికి బదులుగా గోవర్ధన గిరిని పూజించి ప్రకృతికి కృతజ్ఞతలు తెలపాలని సూచించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు బ్రజ్ ప్రాంతంపై భారీ వర్షాలు కురిపించాడు. ప్రజలు, పశువులు ప్రమాదంలో పడటంతో శ్రీకృష్ణుడు.. గోవర్ధన గిరిని తన ఎడమ చేతి చిటికెన వేలిపై ఎత్తి, దాని కింద అందరికీ ఆశ్రయం కల్పించాడు. ఏడు రోజులు, ఏడు రాత్రులు గోవర్ధనాన్ని ధరించి ప్రజలను కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. చివరకు ఇంద్రుడి అహంకారం తొలగిపోయి వర్షాలను ఆపాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని గోవర్ధనధారిగా కొలుస్తారు.
అన్నకూట్ పూజ ఎందుకు చేస్తారు?
గోవర్ధన పూజ రోజున వివిధ రకాల శాకాహార వంటకాలను తయారు చేసి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆహార సమర్పణను అన్నకూట్ అంటారు. కొన్ని ఆలయాల్లో 56 రకాల వంటకాలతో ఛప్పన్ భోగ్ సమర్పించే సంప్రదాయం ఉంది. అనంతరం ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. అలాగే గోవర్ధన గిరికి ప్రతీకగా పేడ లేదా మట్టితో చిన్న కొండను తయారు చేసి పూలతో అలంకరించడం, గోపూజ చేయడం, గోవర్ధన ప్రదక్షిణ చేయడం వంటి ఆచారాలు కూడా ఉన్నాయి.
గోవర్ధన పూజ ఆధ్యాత్మిక సందేశం
గోవర్ధన పూజ మనిషి ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాడనే విషయాన్ని గుర్తుచేస్తుంది. భూమి, నీరు, పశువులు, వృక్షాలు, ప్రకృతి వనరులకు కృతజ్ఞత చూపాలని ఈ పర్వదినం సందేశమిస్తుంది. అదే సమయంలో ఇంద్రుడి అహంకారం, శ్రీకృష్ణుడి వినయం ద్వారా శక్తి ఉన్నవాడు దానిని ఇతరుల రక్షణకు ఉపయోగించాలి అనే గొప్ప ఆధ్యాత్మిక బోధను అందిస్తుంది.
దీపావళి అనంతరం వచ్చే ఈ పర్వదినం ద్వారా శ్రీకృష్ణుడి రక్షణను స్మరించుకుంటూ, ప్రకృతి ప్రసాదించిన అన్నం, నీరు, భూమి, పశుసంపదకు కృతజ్ఞతలు తెలుపుకోవడం గోవర్ధన పూజలోని అసలైన అంతరార్థంగా భావిస్తారు.
