March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

అక్కా.. వెళ్లిపోయావా..

• బైక్ సైడ్ మిర్రర్ను లారీ తాకడంతో బోల్తా

• ఆమె తలపై లారీ చక్రం వెళ్లడంతో దుర్మరణం

• తమ్ముడికి స్వల్పగాయాలు



అనకాపల్లి: మరికొద్ది సేపట్లో ఆనందం పంచుకోవాల్సిన ఆ ఇంట్లో దుర్వార్త వినడంతో కశింకోట మండలం వెదురుపర్తి గ్రామం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. తమ్ముడు భార్య గర్భిణి కావడంతో శనివారం సాయంత్రం ఆమెను పుట్టింటికి పంపించేందుకు కావాల్సిన సరంజామా అంతా తెచ్చేందుకు అతడితో ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్క వి. విజయలక్ష్మి(40) దుర్మరణం చెందగా, తమ్ముడు మళ్ల గిరిబాబు (35)కు గాయాలయ్యాయి.

అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు తమ ద్విచక్ర వాహనంపై కశింకోట నుంచి అనకాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో తుని నుంచి విశాఖ వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి బైక్ సైడ్ మిర్రరు స్పీడ్గా తాకడంతో ఒక్కసారిగా పడిపోయారు. దాంతో లారీ వెనుక చక్రం విజయలక్ష్మి తలపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, గిరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే తన అక్క చనిపోవడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు.

అక్కా వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గాయపడిన అతడిని హైవే అంబులెన్స్లో ఎన్టీఆర్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. గిరిబాబు భార్య ఝాన్సీలక్ష్మి గర్భిణి కావడంతో పుట్టింటికి పంపించేందుకు పూలు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం వారిద్దరూ ద్విచక్ర వాహనంపై బయలు దేరిన సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ అశోక్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి తన భర్త, కుమారుడుతో విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో ఉంటున్నట్టు తెలిసింది.

Also Read

Related posts

Share via