April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: ఆలయ హుండీ లెక్కింపులో కనిపించని నగల మూట.. కట్ చేస్తే.. తెల్లారేసరికి

ఆలయ హుండీ లెక్కింపు సమయంలో ఓ భక్తురాలు వేసిన నగల మూట కనిపించలేదు. కట్ చేస్తే.. భక్తురాలి ఫిర్యాదుతో దేవాదాయ శాఖ అధికారులు మళ్లీ లెక్కింపు చేపట్టగా.. ఈసారి ఊహించని షాక్ ఎదురైంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.


అనంతపురం జిల్లా ఉరవకొండ పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం వివాదాస్పదమవుతోంది. భర్త ఆరోగ్యం కుదుటపడితే పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంది ఓ భక్తురాలు. ఈనెల 7వ తేదీన ఆమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు పెన్నా అహోబిలం దేవస్థానం హుండీలో నిలువు దోపిడీ మొక్కు చెల్లించుకున్నారు. తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటకట్టి భక్తురాలు వనజాక్షి హుండీలో వేసింది. అయితే రెండు రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో నగలు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో భక్తురాలు వనజాక్షి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు దేవస్థానం సిబ్బంది చేతివాటంపై ఫిర్యాదు చేసింది.


భక్తురాలి సమక్షంలోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. హుండీ లెక్కించే సమయంలో నగల మూట జంకాలం(మ్యాట్) కింద ఉండిపోవడంతో నగల మూట గమనించలేదని ఈవో రమేష్ చెబుతున్నారు. దీంతో దేవస్థానం సిబ్బంది పంపకంలో తేడా రావడంతోనే నగల మూట తిరిగి హుండీలో వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భక్తురాలు ఫిర్యాదు చేసే వరకు నగల మూట మాయంపై ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆలయ ఈవో రమేష్‌ను ప్రశ్నించిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు.

హుండీ లెక్కింపు తర్వాత జంకాలాలు(మ్యాట్) తొలగిస్తున్నప్పుడు క్లీనింగ్ సిబ్బందికి నగల మూట కనిపించడంతో.. తిరిగి తనకు అప్పగించారని.. వెంటనే నగల మూటను హుండీలో వేశానని విచారణ అధికారులకు ఈవో రమేష్ సమాధానం ఇచ్చారు. ఈవో రమేష్ వ్యవహార శైలిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీలో వేసిన నగల మూట కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు తెలిపారు

Also read

Related posts

Share via