అభం శుభం ఎరగని ఆ చిన్నారులను బలితీసుకుంటున్నదీ ఎవరూ..! ఆ ఊర్లో ఒకే ఇంట్లో చిన్నారుల వరస మరణాలు కలవరపెడుతున్నాయి. నెల రోజుల క్రితం తృటిలో మృత్యువును జయించిన బాలుడు ఇప్పుడు ఉరి తాడుకు బలయ్యాడు. అదే ఇంట్లో ఎనిమిది నెలల క్రితం మరో బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పిల్లల మరణాల వెనుక అసలు మర్మం ఏంటి..? పోలీసులు ఇప్పటి వరకు విచారణలో ఏం తేల్చారు..?
ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్-శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మనీష్ (6) ను గుర్తు తెలియని వ్యక్తులు తాడుతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. బుధవారం (సెప్టెంబర్ 24)సాయంత్రం తల్లి గ్రామ శివారులో బతుకమ్మ సంబరాలకు వెళ్ళింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒంటరిగా ఉన్న బాలుడు మనీష్ విగతజీవిగా మారాడు. బాలుడి మెడపై ఉరి బిగించిన ఆనవాళ్లు, గాట్లు కనిపించడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. బాలుడి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే రెండు నెలల క్రితం ఇదే బాలుడిపై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కత్తితో మెడపై దాడి చేశారు. మెడపై కత్తి ఘాట్లతో ప్రాణాలతో బయటపడ్డ బాలుడు మృత్యువును జయించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసముద్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గ్రామంలో భయాందోళనలు నెలకున్నాయి. విచారణ కొనసాగుతున్న క్రమంలోనే బాలుడు హత్యకు గురికావడం కలకలం రేపింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతి వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇదే ఇంట్లో జనవరి మాసంలో మనీష్ సోదరుడు నిహాల్ అనే నాలుగేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న నీళ్ల సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నిహాల్ మరణం సాధారణ ప్రమాదం అనుకున్నారు. కానీ తాజా ఘటన నేపథ్యంలో అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్న హత్యలే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మరణాల వెనుక మర్మం ఏంటి..? ఆ కుటుంబాన్ని పగబట్టి బలి తీసుకుంటున్నదీ ఎవరూ..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ మరణాల వెనుక మిస్టరీని తేల్చేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





