SGSTV NEWS
CrimeTelangana

ఆటగదరా శివ.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త.. పెళ్లైనా నెలకే..



ఆ జంట ప్రేమించుకుని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు మాంసం కూరలో కారం ఎక్కువైంది అనడమే భర్త చేసిన తప్పు.. ఆ చిన్న మాట కాస్త పెద్ద విషాదాన్ని మిగిల్చింది. పెళ్లైన నెల రోజులకే దంపతులు అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేరు. ఒక చిన్న మాటకు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి.

వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. జీవితాన్ని ఎంతో ఊహించుకున్నారు. కానీ చిన్న మాట వారి మధ్య చిచ్చుపెట్టింది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి విషాదాన్ని మిగిలిస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు.. నెల రోజులు కూడా కాకముందే ఆత్మహత్యలకు పాల్పడి లోకం వీడారు. దసరా పండుగ రోజు భార్య, దీపావళికి ముందు భర్త బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర మనస్తాపం కలిగించింది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన అల్లెపు సంతోష్, గంగోత్రి నాలుగేళ్ల ప్రేమకు పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు.


పెళ్లి జరిగి వారం రోజులు కాకముందే వారి జీవితంలో విషాదం నెలకొంది. అక్టోబర్ 2న దసరా పండుగ రోజున, సంతోష్ తన భార్యతో కలిసి అత్తింటికి వెళ్లాడు. భోజనం చేసే సమయంలో మాంసం కూరలో కారం ఎక్కువగా ఉందనే చిన్న విషయంలో సంతోష్, గంగోత్రిని మందలించాడు. భర్త మందలింపుతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి.. అదే రోజు రాత్రి అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

భార్య మరణంతో భరించలేక..
భార్య మరణంతో సంతోష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వారం రోజుల క్రితం బాధను తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన అక్క వద్దకు వెళ్ళాడు. అయితే భార్య జ్ఞాపకాలతో కుంగిపోయిన సంతోష్, మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి అయిన నెల రోజులకే దంపతులిద్దరూ లోకం వీడడం ఎర్దండి గ్రామంలో విషాదం నింపింది. క్షణికావేశంలో తీసుకున్న చిన్న నిర్ణయం కారణంగా రెండు కుటుంబాలలో తీరని దుఃఖం మిగిలింది.

Also read

Related posts